శ్రీవైకుంఠ ముహూర్తం ఖరారు..

Wed,September 19, 2018 01:46 AM

-డిసెంబర్ 9వతేదీ నుంచి 19 వరకు ముక్కోటి ఉత్సవాలు
-డిసెంబర్ 18న స్వామివారి తెప్పోత్సవం.. 19న ఉత్తర ద్వారదర్శనం
అక్టోబర్10 నుంచి భద్రాద్రిలో శరన్నవరాత్రి మహోత్సవాలు
భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ప్రధాన వేడుకల ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు వైదిక కమిటీ ప్రభుత్వానికి విన్నవించేందుకు సమాయత్తమవుతోంది. డిసెంబర్9 నుంచి శ్రీ వైకుంఠ అధ్యయన మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్9న స్వామివారికి మత్స్యావతారం, 10న కూర్మావతారం, 11న వరాహావతారం, 12న నృసింహావతారం, 13న వామనవతారం, 14న పరశురామవతారం, 15న శ్రీరామవతారం, 16న బలరామవతారం, 17న శ్రీకృష్ణవతారం గావించనున్నారు. డిసెంబర్18న ఉదయం తిరుమంగైళ్వార్ పరప పదోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం స్వామివారికి గోదావరి నదీ తీరంలో తెప్పోత్సవం జరుపుతారు. 19వ తేదీన ఉత్తర ద్వారదర్శనం వేడుకను నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం నుంచి రాపత్తు సేవలు జరపనున్నారు. ఇదిలా ఉండగా, అక్టోబర్ 10నుంచి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను సైతం వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం సమాయత్తమవుతోంది. ఈ మేరకు వైదిక కమిటీ ముహూర్తం ఖరారు చేసింది. అక్టోబర్10న అమ్మవారికి ఆదిలక్ష్మి అలంకారం, 11న సంతానలక్ష్మి, 12న గజలక్ష్మి, 13న ధనలక్ష్మి, 14న ధాన్యలక్ష్మి, 15న విద్యాలక్ష్మి, 16న ఐశ్వర్యలక్ష్మి, 17న వీరలక్ష్మి, 18న నిజరూపలక్ష్మి, 19న మహాలక్ష్మి అలంకారం గావించనున్నారు. ఈ సందర్భంగా ప్రతీరోజు స్వామివారికి అభిషేక తిరుమంజనం, అలంకారం, కుంకుమార్చన పూజలు, మంత్రపుష్ప పఠనం, అంతరాలయంలో స్వామివారికి ఆరాధన, రాజదర్బార్, యాగశాలలో హోమాలు, సంక్షేమ రామాయణ హవనం తదితర వాటిని నిర్వహించనున్నారు. అక్టోబర్ 19న దసరా పండుగను పురస్కరించుకొని పారువేట, జమ్మిపూజ, శ్రీరామలీల ఉత్సవం, రావణాసురుని వద తదితర కార్యక్రమాలు జరపనున్నారు.

128
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles