కొలువుదీరనున్నగణపయ్య..

Thu,September 13, 2018 12:54 AM

-నేడు వినాయక చవితి పర్వం
-అధిక సంఖ్యలో వెలిసిన మట్టి గణపతులు
-వాడవాడలా గణేష్ మండపాలు
ఖమ్మం కల్చరల్, సెప్టెంబర్ 12 :శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం...ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే...సర్వశుభాల్ని కలిగించేవాడు... సకల విఘ్నాలను తొలగించేవాడు... దేవగణాలకు గురువు... విఘ్నాధిపతి... భక్తుల కొంగుబంగారం... వరసిద్ధి వినాయకుడు తొమ్మిదిరోజుల పాటు భక్తులచే పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు... భాద్రపద శుద్ద చవితి గురువారం వినాయకచవితి పర్వదినాన్ని జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా, అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరులతో పాటు వాడవాడలా ఏర్పాటుచేసిన చలువ పందిళ్లు, భారీసెట్టింగ్‌లు, మండపాల్లో గణనాథుడు కొలువుదీరనున్నాడు. జిల్లాలో వినాయకచవితి పర్వదినాన్ని అత్యంత ఆనందోత్సాహాలు, భక్తి ప్రపత్తులతో నిర్వహించుకునేందుకు భక్తకోటి సిద్ధమైంది. భక్తులు వినాయక చవితిపూజ, వ్రతాలను తమతమ ఇండ్ల వద్ద భక్తిప్రపత్తులతో ఆచరించనున్నారు. తొమ్మిదిరోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లుచేశారు. భారీ సెట్టింగ్‌లు, చలువపందిళ్లు, మండపాలలో నేడు గణపతి కొలువుకానున్నాడు. జిల్లావ్యాప్తంగా సుమారు 20వేల మండపాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. వివిధరకాల నమూనాలలో సెట్టింగ్‌లు ఏర్పాటుచేశారు. పలురకాల ఆకృతులలో గణనాథులు కొలువుకానున్నారు. మండపాల్లో 5అడుగుల నుంచి 20అడుగుల ఎత్తువరకు విగ్రహాలను కొలువు చేయనున్నారు. కాగా ఈదఫా మట్టి గణపతులనే అధికంగా ఉపయోగించన్నారు. జిల్లాకేంద్రంలో సుమారు 1200విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. మండపాల్లో విగ్రహాలను ప్రతిష్టించే ప్రారంభోత్సవాలలో భక్తబృందాలు వినాయక విగ్రహాలతో శోభాయాత్ర చేయనున్నారు. ఉత్సవ కమిటీలు, భక్తబృందాల కోలాహలం నడుమ గణపతులు మండపాల్లో శాస్ర్తోక్తంగా ప్రతిష్ట కానున్నారు.

పత్రి, ఫలపుష్పాలే పూజా ద్రవ్యాలు..
ఈ పండుగ నాడు భక్తులు వేకువజామునే నిద్రలేచి, పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇండ్లను శుభ్రం చేసుకుని, మామిడి తోరణాలతో అలంకరిస్తారు. గదిలో ఈశాన్యమూల స్థలాన్ని శుద్ధి చేసి అలికి, బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు వేస్తారు. పాలవెల్లి కట్టి, దేవుడికి పీట వేసి, ఆ పీటకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ముగ్గువేస్తారు. దానిపై యథాశక్తి గణపతి విగ్రహాన్ని పెడతారు. తొలుత గణపతికి ప్రార్థన చేస్తారు. కలశాన్ని నూతన వస్త్రంతో అలంకరించి, గణపతిని ఆవాహన చేస్తారు. అనంతరం ఆచమనం, దీపారాధన, సంకల్పం, షోడశోపచార పూజ, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యపాద్యాలు, అథ అంగపూజ, శ్వేతగంధాక్షతలు, నానావిధ ఫల, పుష్పాలు, 21 పత్రాలతో పూజ చేస్తారు. అనంతరం ధూప దీప నైవేధ్యాలతో గణపయ్యను ప్రసన్నం చేసుకుంటారు. గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లు, తెల్లనువ్వులు కలిపిన మోదకాలు, అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములు తదితర 21 ప్రసాదాలను నైవేధ్యంగా సమర్పిస్తారు.

వినాయక వ్రత కథ...
చంద్రవంశానికి చెందిన ధర్మరాజు సిరి సంపదలను పోగొట్టుకుంటాడు. కుటుంబంతో వనవాసం చేస్తూ నైమిశారణ్యానికి చేరుకుంటాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి, తన పూర్వ వైభవం కోసం చేయాల్సిన వ్రతాన్ని చెప్పమంటాడు. దానికి సూత మహర్షి వినాయక వ్రతంచేస్తే సకల కష్టాలు తొలగిపోయి, సకల సౌఖ్యాలు కలుగుతాయని చెబుతాడు. కుమారస్వామికి పరమశివుడు ఈవ్రత మహత్యాన్ని గురించి చెబుతాడు. విదర్భ యువరాణి దమయంతి ఈవ్రతం చేయడం వలననే తాను ఇష్టపడిన నలమహారాజును పెళ్లి చేసుకుందని, శ్రీకృష్ణుడు ఈవ్రతం చేయడం వలన శమంతకమణితో పాటు జాంబవతీ, సత్యభామలను పొందగలిగాడని వ్రత మహత్యాన్ని వివరిస్తాడు..

వినాయకోత్పత్తి...
పార్వతిదేవి తను స్నానమాచరించడానికి వెళుతూ నలుగుపిండితో ఒక ప్రతిమను చేసి, దానికి ప్రాణప్రతిష్ట చేసి కాపలా ఉంచుతుంది. ఆబాలుడు శివుడ్ని వాకిట్ల్లోనే నిలిపేస్తాడు. దీంతో ఆగ్రహించిన శివుడు బాలుని శిరచ్ఛేదనం చేస్తాడు. ఆవిషయం తెలుసుకున్న పార్వతి విలవిలలాడుతుంది. శివుడు కూడా చింతిస్తాడు. వెంటనే గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండేనికి అతికించి, ఆశిరస్సుకు శాశ్వతత్వాన్ని కలిగిస్తాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టీ అవుతాడు. సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడిని కోరతారు. ఈవిషయంలో గజానుడు, కుమారస్వామికి పోటీపడుతుంది. ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానంచేసి ఎవరుముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని శివుడు చెబుతాడు. వినాయకుడు నారాయణమంత్రంతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆమంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోను కుమారస్వామికన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు. ఆవిధంగా మూడుకోట్ల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి, మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆవిధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు.

532
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles