పని చేస్తున్నరా.. ఆటలాడుతున్నరా..?

Thu,September 13, 2018 12:53 AM

ఖమ్మం, నమస్తేతెలంగాణ : ఒక్కో సెంటర్ పరిధిలో వైద్యుడు, ఏఎన్‌ఎంలు, ఆషాలు, ఇతర సిబ్బంది మొత్తం కలిపి నలబై మంది పనిచేస్తున్నారు. అయినప్పటికీ పీహెచ్‌సీల్లో ప్రసవాలు సంఖ్య దయనీయంగా ఉంది. అందరూ కలిసి పనిచేస్తున్నరా..? ఆటలాడుకుంటున్నరా..? నెలనెలా జీతాలు తీసుకుంటున్నది దేనికి..? అని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ యోగితారాణ మండిపడ్డారు. రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె తొలుత పలు మండలాల్లోని పీహెచ్‌సీలను సందర్శించారు. తర్వాత నగరంలోని పెద్దాసుపత్రికి వెళ్లి అనువణువూ సందర్శించారు. అక్కడి అధికారులు అందిస్తున్న వైద్యసేవలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి నేరుగా రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞాసమావేశ మందిరంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైద్యాధికారులు, ఉద్యోగులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. మాతాశిశు ఆరోగ్యం, ప్రసవాలు, టీకాలు, కంటి వెలుగు, లెప్రసీ, ఆర్‌బీఎస్‌కే, హైచ్‌ఐవీ, పోహకాహారం పథకాలపై సమగ్రంగా చర్చించారు. ఉభయ జిల్లాల పరిధిలోని ఒక్కో పీహెచ్‌సీ ప్రగతిపై కూలంకషంగా చర్చించిన కమిషనర్ యోగితారాణ అధికారుల కాకిలెక్కలను, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని కడిగిపారేశారు.

జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు..?
ప్రధానంగా ప్రసవాలు, టీకాల కార్యక్రమంపై దృష్టిసారించిన మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ యోగితారాణ అమ్మఒడి, కేసీఆర్ కిట్స్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలవారీగా నమోదవుతున్న సంఖ్యపై ఆరాతీశారు. ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న సెంటర్స్‌తో పాటు ఉభయ జిల్లాల పరిధిలోని నూటికి తొంభైశాతం పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య నెలకు ఒకటి లేదా రెండు నమోదు కావటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇంతమంది అధికారులు, సిబ్బంది ఉండి ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం సరిపడా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ కాన్పులు ఎందుకు చేయటం లేదని, కూర్చుని జీతాలు తీసుకుంటున్నరా అని నిలదీశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నిరుపేదలు ప్రైవేట్ మెట్లెక్కితే దానికి సంబంధిత అధికారులు, సిబ్బందితే బాధ్యత అన్నారు. ఇంటింటికీ తిరుగుతూ గర్భిణీల వివరాలు నమోదు చేసుకుని వారిని కచ్చితంగా సర్కారు వైపు తీసుకురావాలని ఆదేశించారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ దవాఖానాల్లో సాధారణ ప్రసవాల శాతం చాలా తక్కువగా నమోదుకావటంపై వైద్యారోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్ యంత్రాంగాలను మందలించారు. నూటికి యాబై శాతానికి పైగానే సర్జరీలు జరుగుతున్నాయని, దానికి సంబందించిన కారణాలు వెల్లడించాలన్నారు. ప్రభుత్వం అమ్మఒడి, కేసీఆర్ కిట్స్ పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది దీనికేనా అంటూ కమిషనర్ ఆగ్రహించారు. వచ్చేనెలలో మరోసారి జిల్లాకు వస్తానని, యావత్ యంత్రాంగం మొత్తం పనితీరు మార్చుకోవాలని, కాదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

ఖమ్మం సర్కారు దవాఖానా సూపర్..!
తొలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ యోగితారాణ నగరంలోని పెద్దాసుపత్రిని సందర్శించారు. ఎంసీహెచ్ భవనంలోని లేబర్‌రూం, మెటర్నిటీ వార్డ్, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, అక్షయ పిల్లల పునరుజ్జీవ కేంద్రం, ఆర్‌బీఎస్‌కే కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. అన్నిరకాల వివరాలను సంబంధిత మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టీ మదన్‌సింగ్, ఆర్‌ఎంవో డాక్టర్ శోభాదేవి, ఇతర విభాగాల వైద్యులను అడిగి తెలుసుకున్నరు. దవాఖానాలో అందిస్తున్న వైద్యసేవలు, కల్పిస్తున్న వసతుల గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణ కాన్పులపై దృష్టిసారించాలని సూచించారు. రోగుల సౌకర్యార్ధం దవాఖానాలో లిఫ్ట్ సౌకర్యాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఈఈని ఆదేశించారు. కాగా ఉభయ జిల్లాల వైద్యశాఖల పనితీరుపై కలెక్టరేట్‌లో సమీక్షించిన యోగితారాణ ఖమ్మంలోని పెద్దాసుపత్రి చాలా బాగుందని, అక్కడి సిబ్బంది పనితీరు ఆషాజనకంగా ఉందని కితాబివ్వటం గమనార్హం. తక్షణమే మున్సిపల్ నల్లా కనెక్షన్ ఇవ్వాలని, ఆర్వో మంచినీటి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఇక్కడి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ కొండల్‌రావు, దవాఖానా వైద్యులు బీ వెంకటేశ్వర్లు, కృపా ఉషశ్రీ, మంగళ, బీ శ్రీనివాసరావు, వెంకటనర్సయ్య, బాలు, ఎం నాగేశ్వరరావు, నర్సింగ్ పర్యవేక్షకులు డీ సుగుణ, హెడ్ నర్సులు మేరీ, విజయలక్ష్మి, నందగిరి శ్రీనివాస్, ఆర్‌వీఎస్ సాగర్, నయీంఖాన్, గుంటుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా క్షయ నివారణకు ప్రత్యేక ప్రశంస..
ఉభయ జిల్లాల పరిధిలో అమలవుతున్న అన్నిరకాల వైద్యారోగ్య పథకాలపై సమీక్షించిన కమిషనర్ యోగితారాణ సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ జిల్లా క్షయ నివారణ యంత్రాంగంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో క్షయ నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఖమ్మం జిల్లాకు పోల్చిచూసి ఆశ్చర్యపోయారు. టీబీ వ్యాధిగ్రస్థుల నమోదు, వారికి అందిస్తున్న వైద్యసేవలు, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వివరంగా అడిగి తెలుసుకుని జిల్లా అధికారి డాక్టర్ వీ సుబ్బారావును ప్రత్యేకంగా అభినందించారు. అన్ని విభాగాల అధికారులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా సహకరిస్తున్న ముగ్గురు ఆషాలను తీసుకుని హైదరాబాద్‌కు రావాలని, అక్కడే అభినందించి మెమెంటోలు అందజేస్తానని జిల్లా క్షయ నివారణ అధికారికి చెప్పటం గమనార్హం. అంతకు ముందు గత రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మహిళా ఉద్యోగిని కమిషనర్ యోగితారాణి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ జీ శ్రీనివాసరావు, టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశణ్, జాతీయ దోమల నివారణ విభాగం జాయింట్ డైరెక్టర్ పద్మావతి, టీకా విభాగం జేడీ డాక్టర్ సుబీర్, ఇతర అన్ని విభాగాల జాయింట్ డైరెక్టర్స్, ఉభయ జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులంతా పాల్గొన్నారు.

321
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles