టీఆర్‌ఎస్‌కే మద్దతు

Thu,September 13, 2018 12:51 AM

(ఖమ్మం ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ)టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందంటూ పునరుద్ఘాటిస్తున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులకు మహిళలు నుదుటున తిలకం దిద్ది మరీ ఆశీర్వదిస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందిన లబ్ధిదారులు అధికార పార్టీ అభ్యర్థుల పట్ల సానుకూలంగా ఉంటున్నారు. సంక్షేమ పథకాల ద్వారా తాము పొందిన లబ్ధిని పదిమందికి చాటి చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆడపిల్లల పెళ్లిళ్లకు సహాయం చేసిన నాయకులు ఇంత వరకూ ఏ ఒక్కరూ లేరని స్పష్టం చేస్తున్నారు. కూతురు పెళ్లి ఖర్చులకు రూ.లక్ష ఇస్తున్న తండ్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అంటున్నారు. ఇంతటి సహాయం చేసిన వ్యక్తికి ఓటు వేయకుండా ఎలా ఉంటామంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసిన నాయకులకు ఎందుకు ఓటు వేయాలని మహిళలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అపవిత్ర పొత్తులతో అధికారంలోకి రావటమే ధ్యేయంగా వచ్చే నాయకులకు, ఎన్నికలు వచ్చినప్పుడే తాము గుర్తొచ్చే నాయకులకు ఓటు వేయకూడదని ప్రజలు తీర్మానించుకుంటున్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు..
ఇల్లెందు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోరం కనకయ్యకు సింగరేణి కార్మికులు సంపూర్ణ మద్దతు తెలిపారు. బుధవారం ఇల్లెందులోని 21 మైన్ కార్మికులు టీఆర్‌ఎస్ అభ్యర్థి కనకయ్యను గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. సింగరేణి పురిటిగడ్డ అయిన 21మైన్‌ను పునఃప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మూసివేయబడిన మైన్‌ను తిరిగి తెరిపించి కార్మికులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలిపి తిరిగి ఆయనను తిరిగి ఆ సీట్లో కూర్చొపెట్టడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించాలని కార్మికులు నిర్ణయించారు. వారి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులందరితో కారు గుర్తుకు ఓటు వేసే విధంగా ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇక పినపాక నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాయం వెంకటేశ్వర్లు గెలుపును కాంక్షిస్తూ పినపాక నుంచి భద్రాచలం సీతారాముల సన్నిధి వరకూ పలవురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు బుధవారం పాదయాత్ర ప్రారంభించారు. దుగినేపల్లి గ్రామం నుంచి టీఆర్‌ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోడ రమేష్, ఏడూళ్ల బయ్యారం ఎస్సీ సెల్ కార్యదర్శి కొమరబత్తిని శ్రీనులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

పెనుబల్లి మండలం మర్లకుంట శివాలయంలో సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జలగం వెంకటరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేటీపీఎస్‌కు చెందిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం కొత్తగూడెంలో జలగం వెంకటరావువును కలిసి సంపూర్ణ మద్దతు తెలిపారు. అదే విధంగా సత్తుపల్లి నియోజవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిడమర్తి రవికి కేఎం బంజర, మర్లకుంట గ్రామాల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ గ్రామాలలోని అందరి ఓట్లూ పిడమర్తి రవికే వేయాలని తీర్మానించారు. కారు గుర్తుకే ఓటు వేస్తామని బుద్ధయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలను టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు పాల్గొన్నారు. పాలేరులోని అన్ని గ్రామాల వారీగా నూతన ఓటర్లను నమోదు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.

కొలిక్కి రాని పొత్తులు..
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకెళ్తుండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో ఇంకా పొత్తులు కొలిక్కి రాలేదు. దీంతో అ పార్టీల కార్యకర్తలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ అపవిత్ర పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో ఆ రెండు పార్టీల కార్యకర్తలు పొత్తులను జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక వేళ పొత్తులు కుదిరితే ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి చెందిన అభ్యర్థి పోటీ చేస్తారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జనరల్ స్థానాలైన ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాలపైననే ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే వినాయక చవితి గురువారం ఉన్నందున చవితి ముందు కార్యక్రమాలను మొదలు పెట్టేందుకు అభ్యర్థులు జంకుతున్నట్లు తెలుస్తోంది. చవితి తర్వాత అన్ని పార్టీల నాయకులూ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.

256
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles