ప్రచారం హోరెత్తాలి..!

Tue,September 11, 2018 12:45 AM

-ప్రభుత్వ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లండి..
-ప్రతీ డివిజన్‌లో పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేయాలి..
-టీఆర్‌ఎస్ నేతలకు మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ దిశానిర్దేశం
ఖమ్మం, నమస్తేతెలంగాణ: సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయ్. తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోవాలని మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ గులాబీ నేతలకు సూచించారు. సోమవారం సాయంత్రం నగరంలోని రోటరీనగర్ క్యాంప్ కార్యాలయంలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, యాబై డివిజన్ల టీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల పరుగు మొదలయ్యిందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పని ప్రారంభించాలన్నారు. నాలుగేళ్ల మూడు నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు గడపగడపకూ తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్ట,సుఖాల్లో భాగస్వాములయ్యేందుకు ప్రతీ డివిజన్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీఎం కేసీఆర్ సహకారంతో అన్ని డివిజన్లకు కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చామన్న నిజాలను ప్రజానీకానికి వివరించి వారి మద్దతు కూడగట్టాలని పువ్వాడ అజయ్‌కుమార్ ఉపదేశించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమైనా టీఆర్‌ఎస్ ప్రభంజనాన్ని సృష్టించేలా కార్యాచరణ ఉండాలన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతీ గడపనూ ముద్దాడాయని వాటిని లబ్ధిదారులందరికీ గుర్తుచేస్తూ సహకారం కోరాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో కేఎంసీ డిఫ్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, కేఎంసీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించలేదు..
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఏనాడూ తాను మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించలేదని పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని రోటరీనగర్ ప్రాంతంలో గల క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఖురేషి సంఘం ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి అజయ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ముస్లింల సంక్షేమమే ధ్యేయంగా పని చేశానన్నారు. స్థానికంగా ఉంటూ తన దృష్టికి వచ్చిన అన్నిరకాల సమస్యలను పరిష్కరించానని పేర్కొన్నారు. నాలుగేండ్ల, మూడు నెలల కాలంలో సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి, అన్నివర్గాల సంక్షేమానికి చేసిన కృషి ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ముఖ్యంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు చెందిన యువతుల వివాహాలకు షాదీ ముబారక్ చెక్కులను మంజూరు చేయించటంతోపాటు, లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి చెక్కులు అందించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ముస్లిం యువతీ, యువకులకు ఆర్థిక రుణాలు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మైనార్టీలు ఆత్మగౌరవం కోసం ప్రస్తుతమున్న షాదీఖానాకు మరమ్మతులు,

నూతన షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం ఎమ్మెల్యేగా తనకు మరోసారి అవకాశం కల్పిస్తే అన్నిరకాల సంక్షేమ పథకాలను ఎక్కువ మందికి అందేలా పనిచేస్తానని అజయ్‌కుమార్ హామీఇచ్చారు. అదేవిధంగా ఖురేషీల వెసులుబాటు కోసం నూతన కబేలా నిర్మించి ఇస్తానని భరోసానిచ్చారు. అర్హులైన ప్రతీ ముస్లిం కుటుంబానికి డబుల్ బెడ్‌రూం అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖురేషీ యూనియన్ అధ్యక్షుడు సయ్యద్ అయూబ్ ఆధ్వర్యంలో సయ్యద్ చాంద్, సయ్యద్ ఫయాజ్, మక్బుల్, అన్వర్, ఇంతియాజ్, రఫిక్, సయ్యద్‌గౌస్, లతీఫ్, మెహబూబ్‌అలీ, జాని బాలసాని, దాదె సతీష్, మజీద్, నగర సేవాదళ్ అధ్యక్షుడు షేక్ జకీర్ ఖాద్రి తదితరులున్నారు.

212
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles