దుమ్ముగూడెం, సెప్టెంబరు 9: మండలంలోని పెద్ద నల్లబల్లి గ్రామం లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులను వ్యవసాయాధికారి స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామంలోని శరణం అయ్యప్ప ఏజెన్సీకి చెందిన ఓ వ్యాపారి పెద్ద నల్లబల్లి గ్రామంలో ప్రధాన రహదారి పక్కన గోడౌన్‌కు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎరువులను నిల్వ ఉంచారని సమాచారం తెలియడంతో వ్యవసాయాధికారి నవీన్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గోడౌన్లో 22.0.11, 17:17: 17, 10.26.26, 20.20.0, 17.17.17 రకాలకు చెందిన 26 టన్నుల ఎరువుల బస్తాలను అక్రమంగా నిల్వ ఉండటాన్ని పరిశీలించారు. వీటి విలువ రూ.2.60లక్షలు ఉంటుందని తెలిపారు. అదేవ్యాపారికి చెందిన కాశీనగరం గ్రామంలో 50 బస్తాల యూరియా ఎటువంటి అనుమతులు లేకుండా ఉండడంతో వీటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి విలువ రూ.15వేలు ఉంటుందని ఏవో తెలిపారు. వ్యాపారి రాజేష్‌పై 6ఏ కేసు నమోదు చేయనున్నట్లు ఏవో తెలిపారు. ఆయన వెంట ఏఈవోలు హసీనా, మైథిలి, రైతులు ఉన్నారు.