బతుకమ్మ కానుక

Sat,September 8, 2018 12:54 AM

ఖమ్మం సిటీ : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ బహుమతి అందివ్వనుంది.. కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు పండుగలను పురస్కరించుకుని నిధులు విడుదల చేసి శభాష్ అనిపించుకుంటోంది. ఇప్పటికే రంజాన్, క్రిస్మస్ పండుగలకు సర్కారు దుస్తులు పంపిణీ చేస్తూ విందుల ఏర్పాటుకు నిధులు ఖర్చు చేస్తోంది. అదేవిధంగా బతుకమ్మ వేడుకలు ఆడంబరంగా జరుపుకునే మహిళలను గౌరవించేందుకు చీరఅందించే కొత్త పథకానికి ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళా సభ్యులకు ప్రభుత్వం వాయినాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా రూ.180 కోట్లు కేటాయించి 70 లక్షల మందికి బహుమతులు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాలోని డ్వాక్రా సంఘాల మహిళా సభ్యుల వివరాల నివేదికలను సిద్ధం చేసుకుని చీరలు అందించేందుకు అధికారికంగా అడుగులు వేస్తోంది.

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ చీరలు కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రంజాన్ పండుగకు ముస్లింలకు, క్రిస్మస్ రోజున క్రైస్తవులకు బట్టలను కానుకగా అందించింది. రాష్ట్రంలో బతుకమ్మ పండుగ రోజు ఏ నిరుపేద మహిళలు ఆర్థికంగా ఇబ్బందులతో పండుగకు దూరంగా ఉండరాదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతి నిరుపేద మహిళలు, అమ్మాయిలకు చీరలను కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. గత ఏడాది జిల్లాలో 4.50 లక్షల మందికి ప్రభుత్వం చీరలు అందించింది. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరగనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు రాష్ట్ర ప్రబుత్వానికి ప్రతి పాదనలు పంపారు.

రేషన్‌కార్డుల ఆధారంగా...
రాష్ట్రంలో హిందువుల అతి పెద్ద పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి. ఈపూల పండుగకు ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చీర అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన మహిళలతో పాటు 18 ఏళ్లు నిండిన యువతులకు చీరలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా చీరలను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. జిల్లాలో 3,95,840 ఆహార భద్రత కార్డులున్నాయి. రేషన్‌కార్డు కలిగిన ప్రతి మహిళకు చీర అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు 4,48,797 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరితో పాటు కొత్తగా రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబాలలో మరో 10 వేల వరకు అర్హత కలిగిన మహిళలు ఉండవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు.

వైరా, నేలకొండపల్లి గోదాంల్లో..
జిల్లాకు ఎన్ని చీరలు అవసరం ఉండనున్నాయో ఆ వివరాలు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఇప్పటికే తీసుకున్నారు. ఆ జాబితా ప్రకారం జిల్లాకు చీరలను కేటాయించనున్నారు. బతుకమ్మ చీరలను భద్రపర్చేందుకు వైరా, నేలకొండపల్లిలోని పౌరసరఫరాల శాఖ గోధాములను గుర్తించారు. మొదట చీరలను ఇక్కడ భద్రపరిచి అక్కడ నుంచి మండల కేంద్రాలకు అక్కడ నుంచి గ్రామాలకు తరలిస్తారు. ఆతరువాత ప్రభుత్వం ప్రకటించే తేదీలలో చీరలను పంపిణీ చేయనున్నారు.

193
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles