పనులను పర్యవేక్షించాలి

Tue,September 10, 2019 12:06 AM

-ప్రతిరోజు ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలి
-పోషణ మాసోత్సవం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి
-సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్

ఖమ్మం, నమస్తే తెలంగాణ: పల్లెల అభివృద్ధి పనులను మండల ప్రత్యేక అధికారులు ప్రతిరోజు తప్పనిసరిగా పర్యవేక్షించి రోజువారి నివేధికలను సమర్పించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా ఈ నెల 6 నుంచి నేటి వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను ప్రత్యేక అధికారులు నెల రోజుల పాటు ప్రతిరోజు తనిఖీ చేయాలని గుర్తించిన పనులు, చేపట్టక ముందు, పనులు చేపట్టిన తరువాత ఆయా పనులకు సంబంధించిన ఫొటోబుక్‌ను తప్పనిసరిగా ప్రతి పంచాయతీలో నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 6 నుంచి నేటి వరకు చేపట్టిన గ్రామసభలు, కమిటీ సభ్యుల ఎంపిక, పాదయాత్ర ద్వారా గుర్తించిన పనులు, గ్రామ పంచాయతీల ప్రొఫైల్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన నివేధికను పంచాయతీరాజ్‌శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన వెబ్‌పోర్టల్‌లో నిర్దేశించిన పట్టికలలో సమగ్ర సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

దీనితో పాటు గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, స్మశానవాటికలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌స్థలాల వివరాలతో పాటు ప్రతి పంచాయతీలోని నర్సరీల సమగ్ర సమాచారాన్ని వెబ్‌పోర్టల్‌లో ఆప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్ అయిన పనులను బట్టి వార్షిక ప్రణాళికను కూడా సిద్ధం చేసి గ్రామ సభలో ఆమోదం పొందాలని ఆయన సూచించారు. పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో చేపడుతున్న పోషణ మాసం కార్యక్రమాలను నిర్దేశించిన తేదీల్లో అనుబంధ శాఖల అధికారులు తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో అనుంబంధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పోషణ మాసం కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. విద్య, వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమం, వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు తమ తమ కార్యాచరణ ప్రణాళిక అనుగుణంగా సెప్టెంబర్ మాసంలోని నాలుగు వారాల్లో నిర్వహించే కార్యక్రమాలను ఎటువంటి జాప్యం లేకుండా నిర్వహించాలన్నారు.

జూనియర్, డిగ్రీకళాశాల విద్యార్థులకు పోషణ అంశాలపై వ్యాసరచణ పోటీలు నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలలతో పాటు వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ రక్త పరీక్షలు నిర్వహించి రక్త హీనతతో ఉన్న వారికి అవసరమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలతో పాటు జిల్లాస్థాయిలో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు జిల్లా, గ్రామ సమైఖ్య సమవేశాలలో పోషణ అభివృద్ధి అంశంపై మహిళలకు ప్రత్యేక అవగాహన కల్పించాలని, రైతులతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అర్గానిక్ ఫుడ్, ఎరువుల ఉపయోగాల గురించి తెలియజేయాలని సంబంధిత శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు, సీజనల్ వ్యాధులపై నివారణ చర్యల గురించి కూడా పోషణ మాసం కార్యక్రమంలో చేపట్టాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, శిక్షణ కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక, నగరపాలక సంస్థ కమిషనర్ జే శ్రీనివాసరావు, జిల్లా అటవీశాఖాధికారి ప్రవీణ, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ కళావతిబాయి, జిల్లా విద్యా శాఖాధికారి మదన్‌మోహన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బీ ఇందుమతి, జిల్లా సంక్షేమాధికారి ఆర్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఝాన్సీలక్ష్మీకుమారి, పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ హిమబిందు, ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు కే సత్యనారాయణ, హృషీకేష్‌రెడ్డి, రమేష్, బాలల సంరక్షణ జిల్లా అధికారి విష్ణువందన, సంబంధిత శాఖాధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

172
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles