చెరువులో కారు బోల్తా.. ఇద్దరు యువకుల మృతి

Mon,September 9, 2019 12:30 AM

కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్‌ 8: ప్రమాదవశాత్తు కారు చెరువులో బోల్తాపడి ఇద్దరు యువకులు మృత్యువాత పడిన సంఘటన ఆళ్లపల్లి మండలంలో విషాదాన్ని నింపింది. ఆళ్లపల్లి ఎస్సై కోంపెల్లి అంజయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆళ్లపల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన ఆరెం రాజ బాబు (28), సీతారాంపురం గ్రామానికి చెందిన పాయం రవి(33) ఇద్దరు కలిసి శనివారం పనిమీద మర్కోడుకి తమ కారులో వెళ్లి రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారి కారు ఆళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపానికి చేరుకోగానే అక్కడ ఉన్న మూలమలుపు వద్ద అదుపు తప్పి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న మద్దుల చెరువులో బోల్తా కొట్టింది. దీంతో వెంటనే కారు సెంట్రల్‌ లాక్‌ సిస్టం బ్లాక్‌ అవ్వడంతో తలుపు తెరుచుకోలేదు. మునిగిన కారులో చిక్కుక్కుపోయి ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి కారుని చెరువులో నుంచి బయటకు తీశారు. అప్పటికే రాజ బాబు, రవి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఎస్సై అంజయ్య తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించి మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ వైద్యశాలలోని మార్చూరీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. రాజు బాబు బీ-టెక్‌ పూర్తి చేయగా, రవి ఎంబీఏ పూర్తి చేశాడు. ఇద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై అంజయ్య కేసు నమోదు చేసి దార్యప్తు జరుపుతున్నారు. రాజబాబు, రవిల మృతితో ఆళ్లపల్లి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

162
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles