రేణుకా.. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించను..

Fri,April 19, 2019 11:37 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేణుకాచౌదరి ఓటమి భయంతో తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైనది కాదని, చేతనైతే ఆరోపణలను నిరూపించాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు. తాను ఒక్క దొంగ ఓటు వేయించినట్లు రేణుకాచౌదరి నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తానని, మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని ఆయన ఛాలెంజ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలోని వీడీఓస్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇరవై సంవత్సరాల నుంచి జిల్లాలో రాజకీయాలు చేస్తున్న రేణుకాచౌదరి వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? అని ప్రశ్నించారు. చుక్కనీరైనా తేగలిగారా? అని అన్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా పని చేసిన రేణుక జిల్లా అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదని, ఈ రోజున ఎలాగో ఓడిపోతున్నామని వివిధ సర్వే రిపోర్టులు తేల్చి చెప్పుతున్నందున్న ఓటమిని అంగీకరించలేక తనపై ఆరోపణలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. సీనియర్ నాయకురాలిగా ఉన్న రేణుక నిజనిజాలు తెలుసుకోకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, తన కుమారుని పట్ల అనుచితంగా ప్రవర్తించడం పట్ల బాధ కలిగిందన్నారు. ఎన్నికల రోజున ఖమ్మం నగరంలోని 11వ డివిజన్‌లో గల పోలింగ్ బూత్‌లో నా కుమారుడు పోలింగ్ ఏజెంట్‌గా ఉన్నాడని, పోలింగ్ బూత్‌లోకి వచ్చిన రేణుక తన కుమారుని పట్ల, నా పట్ల అమర్యాదగా మాట్లాడిందని, అయినా నేను సంయమనం పాటించానని గుర్తుచేశారు. నా ఓటు, నా భార్య, నా కుమారుడి ఓట్లు ఆ బూత్‌లోనే ఉన్నాయని.. ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఓటు వేస్తున్నామని ఎమ్మెల్యే అజయ్ పేర్కొన్నారు.

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏ వ్యక్తి అయినా ఒక సంవత్సరం పాటు ఒకే చోట నివాసం ఉంటే అక్కడ ఓటు నమోదు చేసుకోవచ్చుననే నిబంధన ఉన్నదని, ఆ మేరకే మమత కళాశాలలో చదువుకుంటున్న పలువురు విద్యార్థులు ఓటు నమోదు చేసుకున్నారని, వారందరూ ఆ బూత్‌లోనే ఓటు వేయడం జరిగిందన్నారు. మెడికల్ విద్యార్థులు ఐదున్నర సంవత్సరాలు, డెంటల్ విద్యార్థులు ఐదు సంవత్సరాలు, బీఎస్‌ఈ నర్సింగ్ విద్యార్థులు 4 సంవత్సరాల కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుందని, ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటారు కనుక వారందరూ ఖమ్మంలో ఓటు నమోదు చేసుకోవడం ఏవిధంగా తప్పు అవుతుందని పువ్వాడ ప్రశ్నించారు. 18 ఏండ్లు నిండిన ప్రతీ వ్యక్తి భారత రాజ్యాంగం ప్రకారం ఓటు నమోదు చేసుకోవచ్చునని, ఈ విషయంలో ఎన్నికల అధికారులు, ఎన్నికల సంఘం ఓటు నమోదు విషయంలో ప్రజలను చైతన్యం చేసే ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. అందులో భాగంగానే, తమ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు, పని చేస్తున్న కార్మికులు ఎంతో మంది ఓటు నమోదు చేసుకున్నారన్నారు.

వారందరికీ ఇతర ప్రాంతాలలో ఓట్లు లేవని, ఇక్కడ మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారని, ఏ వ్యక్తికైనా ఒక్కచోటనే ఓటు ఉంటుందనే విషయాన్ని రేణుకా చౌదరి మర్చిపోవడం దౌర్భాగ్యమన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మెజార్టీ రావడం జరుగుతుందని, ఇదే విషయాన్ని అనేక ఎగ్జిట్ పోల్స్, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సర్వేలలో తేలిందని, రేణుకను ఓడించాలని ప్రజలు డిసైడ్ అయిన విషయాన్ని ఆమె కనిపెట్టారన్నారు. దీంతో ఆమె చేస్తున్న టక్కుటమార గోకర్ణ విద్యలు చెల్లవని అజయ్‌కుమార్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సంక్షేమం అందుతుందని ప్రజలు భావిస్తున్నారని అందుకనే సీఎం కేసీఆర్ పాలనకు రెండోవసారి ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

రేణుకా.. అమరావతికి వెళ్లాల్సిందే..:
- టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు
తెలంగాణలో తెలంగాణ బిడ్డలే రాజకీయాలు చేయాలని స్థానికేతరులకు ఇక్కడ పని లేదని, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి అమరావతిలో విశ్రాంతి తీసుకోవడం మంచిదని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ కనుక అక్కడ రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. జిల్లాలో ఆమె సేవలు అవసరం లేదని, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వలనే సీఎం కేసీఆర్ సీఎం అయినట్లు చేస్తున్న గోబెల్స్ ప్రచారం నమ్మవద్దన్నారు. ఈవీఎంల ట్యాంపరింగే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎలా గెలుస్తారని తాతా మధు ప్రశ్నించారు. ఎన్నికలలో హూందాగా ఉండాలన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ తరుపున ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాల వలన రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతూ అనేక పిటిషన్లు వేస్తున్నారని, వారివన్నీ అబద్దాలని నిరూపన అయ్యాయన్నారు.

ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలను టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ.. రేణుకాచౌదరి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఖమ్మం మేయర్ జీ. పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు, కార్పొరేటర్ కమర్తపు మురళి, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, పాలడుగు పాపారావు, లక్ష్మీసుజాత, శీలంశెట్టి రమా, రుద్రగాని శ్రీదేవి, నీలం జయమ్మ, కనకం లక్ష్మీ, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ నాయకులు పసుమర్తి రామోహన్‌రావు, పొన్నం వెంకటేశ్వర్లు, పల్లా కిరణ్, గుండ్లపల్లి శేషగిరిరావు, శీలంశెట్టి వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, పాలెపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

432
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles