పెట్రోల్‌, డీజిల్‌ను విడిగా విక్రయించవద్దు

Thu,December 5, 2019 02:57 AM

కరీంనగర్‌ క్రైం : పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు పెట్రోల్‌, డీజిల్‌ను విడిగా విక్రయించవద్దని సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కమిషనరేట్‌ కేంద్రంలో పెట్రోల్‌ బంకుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. పెట్రోల్‌ లేని కారణాలతో వాహనాలు రోడ్లపై నిలిచిపోయిన సందర్భాల్లో సదరు వాహనదారుల వద్ద ఆధారాలు పరిశీలించి మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ పోయవచ్చన్నారు. పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు కనీసం 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ కెమెరాలు ఐపీ బేస్డ్‌ నాణ్యత కలిగి ఉండి కనీసం 50 మీటర్ల దూరాన్ని నిక్షిప్తం చేసేలా ఉండాలని తెలిపారు. ఈ కెమెరాలను వారం రోజుల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎంట్రెన్స్‌, ఎగ్జిట్‌, క్యాష్‌ కౌంటర్‌, పెట్రోల్‌ బంకు ఆవరణ రోడ్డు స్పష్టంగా కన్పించేలా కెమెరాలు అమర్చుకోవాలన్నారు. ఐపీ బేస్డ్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే స్మార్ట్‌ ఫోన్లలో దృశ్యాలను చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. హాక్‌ ఐ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

కమిషనరేట్‌లో ఇప్పటి వరకు 1.15 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. మహిళల రక్షణ, భద్రత కోసం ఇందులో ప్రత్యేక సదుపాయాలున్నాయన్నారు. హెల్మెట్‌ లేని వారికి పెట్రోల్‌ పోయవద్దన్నారు. ఈ సందర్భంగా పెట్రోల్‌ బంకుల నిర్వాహకులతో హాక్‌ ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు శ్రీనివాస్‌, చంద్రమోహన్‌, ఎస్‌బీఐ ఇంద్రసేన, ఆర్‌ఐ మల్లేశం, ఐటీ సెల్‌, సైబర్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జి ఆర్‌ఎస్‌ఐ మురళీ, తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles