సిరుల రొయ్య

Sat,November 16, 2019 03:34 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎల్‌ఎండీ జలాశయంలో గతంలో మత్స్యకారులు సంప్రదాయ పద్ధతిలో ఏటా చేప విత్తనాలు మాత్రమే వేసుకుని వాటిని వేటాడి జీవనం సాగించే వారు. 8 వేల హైక్టార్ల నీటి విస్తీర్ణం గల ఈ రిజర్వాయర్ పూర్తిగా మంచి నీటితో విస్తరించి ఉంది. ఇందులో పెరిగిన చేపలకు మంచి డిమాండ్ ఉంది. జలాశయంలో వేటాడిన చేపలను మత్స్యకారులు స్థానికంగా విక్రయించడమే కాకుండా ఇతర రాష్ర్టాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. అయితే పూర్తిగా మంచి నీటితో విస్తరించి ఉన్న ఈ జలాశయంలో రొయ్యల పెంపకం చేపడితే మత్స్య కారులకు మరింత లాభదాయంగా ఉంటుందని భావించిన మత్స్య శాఖ అధికారులు రెండేళ్లుగా రొయ్య విత్తనాలు వదులుతున్నారు. గతేడాది జలాశయంలో 80-100 మిల్లీ మీటర్ల పొడవుగల చేప విత్తనాలు 30 లక్షలు, ఇదే సైజులో ఉన్న రొయ్య విత్తనాలు మరో 30 లక్షలు వదిలారు.

మత్స్య కారులకు మెరుగైన ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీపై ఈ విత్తనాలు జలాశయంలో వదిలింది. ఎప్పటిలా చేప విత్తనాలే కాకుండా అదనంగా రొయ్య విత్తనాలు కూడా వదలడంతో జలాశయం చుట్టు పక్కల గ్రామాలకు చెందిన సుమారు 1,500 మత్స్యకార కుటుంబాలకు లాభం జరిగింది. గతేడాది 120 టన్నుల రొయ్యల దిగుబడి వచ్చినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి ఖదీర్ అహ్మద్ స్పష్టం చేశారు. ఇక్కడి రొయ్యకు స్థానికంగానే కాకుండా ఇతర రాష్ర్టాల్లో మంచి డిమాండ్ ఏర్పడటంతో ఆంధ్రా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ర్టాలకు ఎగుమతి చేసి మత్స్యకారులు మంచి లాభాలు ఆర్జినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రెండో సారి రొయ్య విత్తనాలు వదిలేందుకు ఏకంగా పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను రప్పిస్తున్నారు. శనివారం ఆయన చేతుల మీదుగా పూర్తి సబ్సిడీపై జలాశయంలో 30.36 లక్షల స్క్యాంపీ రొయ్య విత్తనాలను వదులుతున్నారు. వీటి విలువ సుమారు రూ.66 లక్షల వరకు ఉంటుంది.

మత్స్యకారులకు అదనపు ఆదాయం
ఈ జలాశయంలో రొయ్యల పెంపకం ద్వారా మత్స్యకారులకు అదనపు ఆదాయం లభిస్తోంది. చేపలు నీటి పై భాగంలో పెరిగితే రొయ్యలు నీటి అడుగు భాగంలో పెరుగుతాయనీ, దీంతో ఇటు చేపలు, అటు రొయ్యలు సహజంగా పెరిగి మత్స్య కారుకుల మంచి లాభాలు తెచ్చి పెడుతున్నాయని మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌ఎండీ జలాశయం చుట్టు పక్కల ఉండే కొత్తపల్లి మండలంలోని ఎలగందుల, చింతకుంట, కమాన్‌పూర్, బావుపేటతోపాటు కరీంనగర్‌లో ఉండే మత్స్యకారులు, గన్నేరువరం మండలంలోని గన్నేరువరం, మైలారం, జంగపల్లి, పంతులు కొండాపూర్, గునుకుల కొండాపూర్, పారువెల్ల, హన్మాజీపల్లి, తిమ్మాపూర్ మండలంలోని తియ్మిపూర్, నుస్తులాపూర్, రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, అల్గునూర్, మహాత్మానగర్, రేణికుంట, వచ్చునూర్, చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్, రామంచ, తదితర గ్రామాల పరిధిలో సుమారు 1,500 మందికి పైగా మత్స్య కారులు ఈ జలాశయంలో చేపలు వేటాడి జీవించే వాళ్లు.

ఇప్పుడు రొయ్యలు కూడా అదనంగా వస్తుండడంతో వారి ఆదాయం మరింత పెరిగింది. 2017లో ఈ జలాశయంపై మార్కెటింగ్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 417 మంది మాత్రమే సభ్యులుగా ఉండేవారు. ఇపుడు 1,430 మందికిపైగా చేపల వేటకు లైసెన్స్‌లు జారీ చేశారు. జలాశయంలో రొయ్యల పెంపకం ప్రారంభమైన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో మార్పులు వస్తున్నాయి. ఇక్కడ లభించే రొయ్యలు పూర్తిగా మంచి నీటిలో పెరుగుతున్నందున స్థానిక మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. రూ.200 నుంచి రూ.300లకు పైగా కిలో ధర పలుకుతోంది. గతేడాది 120 టన్నుల వరకు వచ్చిన దిగుబడులను సొసైటీ ద్వారా ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసి మంచి లాభాలు ఆర్జించినట్లు అధికారులు చెబుతున్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ఈ మార్కెటింగ్ సొసైటీకి 75 శాతం రాయితీపై సబ్సిడీ ద్విచక్ర వాహనాలు 43, వలలు 215, ఒక లగేజీ ఆటో, ఒక సంచార చేపల వాహనం, మరో హైజెనిక్ వాహనాన్ని కూడా అందించినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి ఖదీర్ అహ్మద్ తెలిపారు.

జిల్లాలో పుష్కలమైన అవకాశాలు
మంచి చేపలు, రొయ్యల ఉత్పత్తి చేపడుతూ ఎల్‌ఎండీ జలాశయం రాష్ర్టానికే తలమానికంలా మారింది. వర్షాలు సమృద్ధిగా కురియడం, కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టులతో వచ్చిన జలాలతో స్థానిక చెరువులు, కుంటలు నింపుతుండడంతో చేపలు, రొయ్యల పెంపకానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే మత్స్య సంపదపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సుమారు 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లాలో 165 మత్స్య పారిశ్రామిక సంఘాలు, 5 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల్లో 12,864 సభ్యులు ఉన్నారు. నీటి లభ్యత పెరుగుతున్న కొద్దీ జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని భావిస్తుండడంతోపాటు ప్రభుత్వం పూర్తి ఉచితంగా చేప, రొయ్య విత్తనాలను అందిస్తున్న నేపథ్యంలో క్రమంగా సొసైటీల్లో సభ్యుల సంఖ్య పెరుగుతోంది.

చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాల కోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 75 శాతం రాయితీతో పలు యూనిట్లను పంపిణీ చేసింది. చేప, రొయ్యల పెంపకంలో వీరికి క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 141 మత్స్యశాఖ చెరువులు, 733 స్థానిక చెరువులు ఉన్నాయి. 2018-19లో 565 చెరువుల్లో వంద శాతం సబ్సిడీ పథకం కింద కోటి 53 లక్షల 84 వేల చేప విత్తనాలు వదిలారు. 2019-20లో 670 సీజనల్ చెరువుల్లో 35-40 మిల్లీ మీటర్ల చేప విత్తనాలు కోటి 34 లక్షల 12 వేలు వదిలారు. వీటి విలువ రూ.60.35 లక్షలు. 75 శాశ్వత చెరువుల్లో 80-100 మిల్లీ మీటర్ల పొడవు ఉన్న చేప విత్తనాలు 62.61 లక్షలు వదలాలని లక్ష్యంగా నిర్ణయించుకుని ఇప్పటికే అనేక చెరువుల్లో వదిలారు. వీటి విలువ రూ.63.86 లక్షలు ఉంటుంది. కట్ల, రాహు, బంగారు తీగ, మ్రిగాల వంటి రకాల చేపలనే కాకుండా నెల్లూరు హైచరీస్ నుంచి తెప్పించిన స్క్యాంపీ రొయ్యలను ఎల్‌ఎండీ జలాశయంలో వదలుతుండడంతో మత్స్యకారులకు అదనపు ఆదాయం సమకూరుతోంది.

సమీకృత అభివృద్ధి సఫలీకృతం
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం పటిష్టంగా అమలు చేస్తున్న సమీకృత మత్స్య అభివృద్ధి పథకం జిల్లాలో పూర్తిగా సఫలీకృతమైంది. దీని కింద వేలాది మంది మత్స్యకారులు అనేక పథకాల్లో 75 శాతం, కొన్ని పథకాల్లో వంద శాతం రాయితీతో లబ్ధి పొందారు. ఈ పథకం కింద జిల్లాలోని మత్స్యకారులకు రెండేళ్లలో రూ.24.30 కోట్ల లబ్ధి చేకూరింది. ముఖ్యంగా చేపల వేటకు వెళ్లేందుకు జిల్లాలో రూ.12.46 కోట్లతో 3,216 మోపెడ్‌లు, రూ.5.92 కోట్లతో 158 లగేజీ ఆటోలు, రూ.2.22 కోట్లతో 38 సంచార చేపల అమ్మక వాహనాలు, రూ.71.50 లక్షలతో 11 హైజెనిక్ వాహనాలు, రూ.1.78 కోట్లతో 28 చేపల చెరువులు, రూ.48 లక్షలతో 8 చేప పిల్లల పెంపకం చెరువులు, రూ.43.20 లక్షలతో 288 చేపల వేట పరికరాలు, రూ.6.90 లక్షలతో 46 పోర్టబుల్ కియోస్క్‌లు, రూ.7.50 లక్షలతో 5 లాగుడు వలలు, రూ.8.68 లక్షలతో 2 ఫుడ్ కియోక్స్‌లు మంజూరు చేశారు. అంతే కాకుండా 3 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలకు రూ.9 లక్షల రివాల్వింగ్ ఫండ్ కూడా ఇచ్చారు. ఇవి కాకుండా 2016-17లో రూ.2.61 కోట్లతో 29 కమ్యూనిటీ హాళ్లను మంజూరు చేశారు.

ముచ్చటగా మూడోసారి..
ఎల్‌ఎండీ జలాశయంలో రొయ్యల పెంపకం మత్స్యకారుల కుటుంబాలకు మంచి లాభాలను ఆర్జించి పెడుతుండడంతో అధికారులు మరోసారి రొయ్య విత్తనాలు వేయాలని నిర్ణయించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ చేతుల మీదుగా జలాశయంలో విడుదల చేస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి ఖదీర్ అహ్మద్ తెలిపారు. జలాశయం కట్టపై ఉన్న లేక్ పోలీస్ ఔట్ పోస్టు సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే తమ శాఖ తరుపున బీమా పథకం ద్వారా మంజూరైన 30 పశువులను పాడి రైతులకు అందిస్తామని జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి వీ అశోక్ కుమార్ వెల్లడించారు.

126
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles