ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

Sat,November 16, 2019 03:33 AM

హుజూరాబాద్ టౌన్: దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించని చందంగా మారింది ధాన్యం రైతుల పరిస్థితి. గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా.. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని చెల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చెల్పూర్, తోకలపల్లిలో ఐకేపీ, పాక్స్ కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో గత మూడు రోజులుగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదని ఆరోపిస్తూ శుక్రవారం సాయంత్రం రైతులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. గత మూడు రోజులుగా ధాన్యం నింపడానికి బార్‌దాన్ సంచులు ఇవ్వకుండా, రంగుమారిందనీ, అధిక తేమ ఉందని సాకులు చెబుతున్నారనీ, బస్తాకు రూపాయి చొప్పున వసూలు చేయడంతో పాటు తరుగు పేరుతో కోత విధిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో చెల్పూర్, తోకలపల్లికి చెందిన సుమారు వంద మంది రైతులు పాల్గొన్నారు. కాగా దీనిపై ఐకేపీ ఏపీఎం సీహెచ్ తిరుపతి వివరణ ఇస్తూ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తీసుకెళ్లడానికి మాత్రమే మిల్లర్లు కేంద్రానికి వస్తున్నారనీ, కొనుగోళ్లలో వారి జోక్యం లేదని స్పష్టం చేశారు. అలాగే తరుగు తీస్తున్నట్లు, రైతుల నుంచి సంచికి రూపాయి తీసుకుంటున్నట్లు తన దృష్టికి రాలేదనీ, విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తానని పేర్కొన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles