సుభాష్‌నగర్: స్థానిక మంకమ్మతోట సిద్దార్థ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో ఆ విద్యా సంస్థల చైర్మన్ దాసరి నర్సింహారెడ్డి జ్ఞాపకార్థం ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి (పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల) ఇంటర్ స్కూల్ క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక సిద్దార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో క్విజ్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 8,9,10వ తరగతుల విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈ క్విజ్ పోటీలకు ఒక పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎన్ని గ్రూపులైనా పాల్గొనవచ్చునన్నారు.
ఈ క్విజ్ పోటీలు మొదటి విభాగం (ప్రిలిమినరీ)లో విద్యార్థులకు ఈ నెల 24న భగత్‌నగర్‌లోని సిద్దార్థ పాఠశాలలో ఉదయం 10గంటలకు రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ చూపిన ఎనిమిది గ్రూపులను ఎంపిక చేసి ఈ నెల 30న ఐఐటీ క్యాంపస్ మంకమ్మతోటలో ఫైనల్ రౌండ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ క్విజ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన గ్రూపులకు వరుసగా రూ.5,001, రూ.2,001, రూ.1,001 చొప్పున నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. క్విజ్ పోటీల్లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, క్రీడలు, అబ్రివేషన్స్, జనరల్ నాలెడ్జీ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయని పేర్కొన్నారు. వివరాలకు 9652138289 సెల్ నంబరులో సంప్రదించాలని సూచించారు.