ప్రజా సమస్యలపై సత్వరం స్పందించాలి

Tue,November 12, 2019 03:31 AM

టవర్‌సర్కిల్: ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలనీ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు విభాగాల అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా అధికారులంతా విధిగా డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలకు తప్పకుండా హాజరుకావాలన్నారు. ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో రోడ్డుపై రైతులు రెండు నెలల నుంచి వడ్లు ఆరబోస్తున్నారనీ, దీనితో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఫిర్యాదు రాగా, ఐకేపీ కేంద్రాల్లోనే వడ్లను ఆరబోసేలా ఏర్పాట్లు చేస్తామని డీఆర్‌ఓ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని మల్కాపూర్ కాలనీలో తాగునీరు రావడం లేదని కాలనీవాసి ఫిర్యాదు చేయగా, మున్సిపల్ అధికారులు వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.

రామడుగు మండలం వెదిర గ్రామం నుంచి కర్ణాకర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొనగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రేకుర్తి నుంచి పద్మ మాట్లాడుతూ గ్రామంలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఫిర్యాదు చేయగా, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, మెప్మా పీడీ పవన్‌కుమార్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, వ్యవసాయాధికారి శ్రీధర్, డీటీఓ శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles