వరి దిగుబడులపై అకాల ప్రభావం

Sun,November 10, 2019 01:11 AM

-ఈ సారి తగ్గుతున్న ధాన్యం దిగుబడులు
-వెల్లడిస్తున్న పంట కోత ప్రయోగాలు
-ఆరు మండలాల్లో మరీ ఘోరం
-ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్లే..
(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)వానాకాలం సీజన్ ధాన్యం దిగుబడులను అంచనా వేసేందుకు జిల్లాలో ప్రతి వంద హెక్టార్లకు ఒక ప్రయోగ ప్రదేశం చొప్పున 588 చోట్ల పంట కోత ప్రయోగాలు చేయాలని ప్రణాళికా శాఖ అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ అధికారులు పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. 5 x5 విస్తీర్ణంలో ప్రతి పంట కోత ప్రదేశాన్ని ఎంపిక చేస్తారు. ఈ ప్రదేశంలో వచ్చిన దిగుబడి ఆధారంగా ఆ వంద హెక్టార్లలో వచ్చే దిగుబడిని అంచనా వేస్తారు. అయితే పంట కోత ప్రయోగాలకు ఎంపికైన చాలా ప్రదేశాల్లో అకాల వర్షాలతో అసలు దిగుబడులు రాని పరిస్థితి ఉన్నది. మానకొండూర్, శంకరపట్నం, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, తదితర మండలాల్లోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికీ అనేక గ్రామాల్లో చేతికి వచ్చిన పంట నీట మునిగే ఉంది. పడిపోయిన పంట పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తున్నది. గురువారం శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో పంట కోత ప్రయోగాలకు వెళ్లిన అధికారులకు అసలు దిగుబడులు రాని పరిస్థితి కనిపించింది. ఎంపికైన ప్రదేశం ఇప్పటికీ నీటిలో ఉండడంతో అధికారులు విధి లేక జీరో దిగుబడి కింద నమోదు చేసుకోవాల్సి వచ్చింది. ఇటీవల జరుగుతున్న పంట ప్రయోగాల్లో అధికారులకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి.

సగటున 8 నుంచి 14 క్వింటాళ్లే..
సాధారణంగా వరి ఎకరాకు 22 నుంచి 24 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ సారి పంటలు బాగా పండుతున్నాయనుకున్న సమయంలో అకాల వర్షాలు కురియడంతో సగటు దిగుబడి ప్రమాదకరంగా పడిపోయింది. ముందుగా వచ్చిన కోతల్లో వచ్చిన దిగుబడులకు ఇప్పుడు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. గత సెప్టెంబర్ చివరి వారంలో జిల్లాలో పంట కోత ప్రయోగాలు ప్రారంభించారు. అపుడు అకాల వర్షాల ప్రభావం లేకపోవడంతో ఎకరాకు 24 నుంచి 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎక్కువ విస్తీర్ణంలో ఆలస్యంగా సాగు చేసిన వరిలో మాత్రం అకాల వర్షాలతో సగటు దిగుబడి ప్రమాదకరంగా తగ్గింది. ఇప్పుడు నిర్వహిస్తున్న పంట కోత ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడవుతున్నది. సగటున 8 నుంచి 14 క్వింటాళ్లకు దిగుబడి పడిపోయింది. సాధారణంగా కోతల సమయంలో 18 శాతానికి అటీటుగా తేమ శాతం వస్తుంది. కానీ, ఇప్పుడు జరుగుతున్న కోతల్లో 30 శాతానికి మించి తేమ ఉంటున్నది. ఒక్కో ప్రయోగ ప్రదేశంలో ధాన్యంలో 70 శాతం తేమ కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

బీమాపైనే ఆశలు..
ప్రతి సీజన్‌లో పంట కోత ప్రయోగాలు నిర్వహించడం ద్వారా దిగుబడులను అంచనా వేస్తుంటారు. వానాకాలం సీజన్‌లో కూడా ఇదే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. అయితే తగ్గిన దిగుబడిని బట్టి పెట్టుబడి రాయితీలు, ఇతర రాయితీలు రైతులకు లభించే అవకాశముంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపైనే రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. వానాకాలం సీజన్‌లో పంట రుణాలు తీసుకున్న 21,942 మంది రైతులు 4.13 కోట్లు, 815 మంది పత్తి రైతులు 32.12 లక్షల వరకు చెల్లించి ఈ బీమా పథకంలో చేరినట్లు తెలుస్తున్నది. రుణాలు తీసుకోని రైతు మరో సుమారు 1,200 మందికి పైగా వరికి బీమా ప్రీమియం చెల్లించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పంట కోత ప్రయోగాల్లో వచ్చే ఫలితాలను బట్టి పరిహారం చెల్లించే అవకాశమున్నది. ఇప్పటికే సగానికంటే ఎక్కువ ప్రదేశాల్లో ప్రయోగాలు పూర్తయ్యాయి. అయితే తీవ్రంగా పంట నష్టం జరిగిన మండలాల్లో దిగుబడులు పెద్ద మొత్తంలో తగ్గుతున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికపుడు నివేదికలు సమర్పిస్తున్నారు. ఈ సారి పెట్టుబడి రాయితీకంటే బీమా క్లెయింలే ఎక్కువగా ఉండే అవకాశమున్నది. ఈ సారి అధికారులు ఎక్కువ మంది రైతులకు అవగాహన కల్పించి, బీమా ప్రీమియం చెల్లించుకునేలా చేశారు. ఇలాంటి రైతులకు నష్టపరిహారం రావడం ఖాయంగా కనిపిస్తున్నది.

103
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles