రైతులకు న్యాయం చేస్తాం

Sun,November 10, 2019 01:09 AM

శంకరపట్నం/హుజూరాబాద్ రూరల్: అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని పీఎంఎఫ్‌బీవై రాష్ట్ర నోడల్ అధికారి గార్గి ఉపాధ్యాయ భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా పంట నష్టపోగా, ప్రణాళికా శాఖ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), ఇఫ్‌కో టోక్యో ఆధ్వర్యంలో కేంద్ర బృందం సభ్యులు శంకరపట్నం మండలంలోని ముత్తారం గ్రామ శివారులో తాడికల్‌కు చెందిన రైతు కీసర సంపత్, హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో సంది శ్రీధర్‌రెడ్డి పొలంలో పంటకోత ప్రయోగం నిర్వహించారు. బురద పొలంలోకి దిగి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేశారు. నేలకొరిగిన వరితో పాటు, తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు అధికారులకు తమ సమస్యలను వివరించారు. అకాల వర్షాలకు ఎన్నడూ లేనంత పంట నష్టం జరిగిందని వాపోయారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యం తడిసిందనీ, తేమ శాతం ఎక్కువగా ఉందనీ, రంగు మారిందని కొనుగోలు చేయడం లేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా పీఎంఎఫ్‌బీవై రాష్ట్ర నోడల్ అధికారి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు.

ధాన్యంలో తేమశాతం 71.5 వచ్చిందని వెల్లడించారు. పంట నష్టంపై సమీక్షించి రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రితో పాటు ఆ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే రైతులు తప్పనిసరిగా పంటబీమా చేయించుకొని ఉండాలని సూచించారు. ఇందుకు వ్యవసాయ అధికారులు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ఇక్కడ ఆర్థిక, గణాంక శాఖ జేడీ జే దయానందం, కరీంనగర్ అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారులు అనిత, సుబోదిని, డీఏఓ వాసిరెడ్డి శ్రీధర్, కరీంనగర్ ముఖ్య ప్రణాళికా అధికారి (సీపీఓ) సత్యనారాయణరెడ్డి, హుజూరాబాద్ ఆర్డీఓ చెన్నయ్య, హుజూరాబాద్ డివిజనల్ డీవైఎస్‌ఓ కే శ్రీనివాస్‌రెడ్డి, తాసిల్దార్ విజయలలిత, ఏఓ శ్రీనివాస్, ఎంపీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, తాడికల్ సర్పంచ్ కీసర సుజాత, ఎరడపల్లి ఎంపీటీసీ జంగిలి సంపత్, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సభ్యుడు చింతిరెడ్డి రవీందర్‌రెడ్డి, ఏఈఓలు రాజ్‌కుమార్, శ్రావణి, లక్ష్మీప్రసూన, రజనీకాంత్, కందుగులలో ఆర్డీవోతోపాటు ఏడీఏ ఆదిరెడ్డి, ఏవోలు సునీల్, గోవర్ధన్, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles