వరి నేలకొరిగితే.. జాగ్రత్త

Sun,November 10, 2019 01:08 AM

తిమ్మాపూర్ రూరల్: ఈసారి అతివృష్టితో పంటలు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరికి చాలా నష్టం వాటిల్లింది. నెల కింద కోయాల్సిన వరి.. భూమి తడి ఆరక ఇప్పుడిప్పుడు కోస్తున్న పరిస్థితి. అయితే ఇటీవల ఈదురు గాలులతో కూడిన వర్షానికి చాలా వరకు వరి నేలకొరిగింది. దీనివల్ల పొలంలో గాలి తగలక పైరుకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో నేలరాలిన వరిపైరు కాపాడుకునేందుకు తిమ్మాపూర్ ఏఈవో స్వామి పలు సూచనలు చేశారు. కోతకు సిద్ధంగా ఉండి నేలవాలిన వరి పొలంలో నీళ్లు నిలిస్తే సాధ్యమైనంత త్వరగా బయటకు పంపించాలి నేలవాలిన వరి కంకులను పైకి కట్టలాగ కట్టి నిలబెట్టాలి. దీని వల్ల గాలి సోకి పైరు కుళ్లిపోకుండా ఉంటుంది. గింజ మొలకెత్తి, రంగు మారకుండా ఉండేందుకు 5 శాతం ఉప్పు ద్రావణం ఒక లీటర్ నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి.పైరు పూత నుంచి గింజ గట్టిపడే దశలో ఉండి నేలకొరిగితే పంటను వీలైనంత వరకు నిలబెట్టి జడ మాదిరిగా కట్టాలి.ఈ స్థితిలో పైరుపై వివిధ రకాల శిలీంద్రపు బూజు తెగులు పెరిగి గింజలు నాణ్యత కోల్పోతాయి. వీటిని నివారించేందుకు ప్రొఫికోనాజోల్1.0మి.లీ నీటికి కలిపి ఒకసారి పిచికారీ చేయాలి.ఆలస్యంగా వేసిన పైరులో మెడవిరుపు తెగుల ఉధృతి పెరుగుతుంది. దీన్ని నివారించేందుకు ముందస్తుగా కానుగమైసిన్ 2.5 మిల్లీ లీటర్లు లేదా ఐసోప్రొథయెలిన్ 1.5మిల్లీ లీటర్లు లేదా ట్రైసైక్లోజోన్ 0.6గ్రా. లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి.ఈ కాలంలో రెల్ల రాల్చు పురుగు కూడా ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు క్లోరోఫైరిఫాస్ 2.5మి.లీ లేదా డైక్లోరోపాస్ 1.0 మి.లీ మందును లీటర్ నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles