ప్రజలంతా సామరస్యంగా ఉండాలి

Fri,November 8, 2019 01:26 AM

కరీంనగర్ క్రైం: కరీంనగర్ ప్రజలంతా సామరస్యంగా ఉండాలని సీపీ కమలాసన్‌రెడ్డి కోరారు. ఈనెల 17న అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం సీపీ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ముందుగా కమిషనరేట్ కేంద్రంలో భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ, హిందువాహిని సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో కూడా సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా సంబురాలు చేసుకోవడం, నిరసనలు తెలపడం చేయవద్దన్నారు. అనుకూలంగా వస్తే సంబురాలు, పటాకలు కాల్చడం, మిఠాయిలు పంచిపెట్టడం నిషేధమన్నారు. వ్యతిరేకంగా వస్తే ఆయా మతాల వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం, ర్యాలీలు తీయడం చేయరాదన్నారు. తీర్పుకు సంబంధించి ఏ సంస్థ ప్రతినిధులైనా, మతానికి సంబంధించిన వారైనా సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శించడం, సంబురాలు చేసుకునే వీడియోలు పోస్టు చేయడం లాంటివి చేయరాదన్నారు. రెచ్చగొట్టే పోస్టులు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అత్యున్నత న్యాయస్థానం తీర్పుగా గౌరవించి సంయమనం పాటించాలనీ, తీర్పును వ్యతిరేకించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టౌన్ ఏసీపీ అశోక్, సీఐలు విజయ్‌కుమార్, దేవారెడ్డి, విజ్ఞాన్‌రావు, ఎస్‌బీఐ ఇంద్రసేనారెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles