మద్యానికి బానిసై కార్మికుడి మృతి

Fri,November 8, 2019 01:25 AM

శంకరపట్నం: పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఓ కార్మికుడు తాగుడుకు బానిసై, ఆరోగ్యం క్షీణించి మృతి చెందిన ఘటన శంకరపట్నం మండలం మొలంగూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని సేలంకు చెందిన వెంకటేశ్ (45) బతుకుదెరువు కోసం శంకరపట్నం మండలానికి వచ్చాడు. కొత్తగట్టుకు చెందిన ఓ గ్రానైట్ క్వారీలో రెండేళ్ల క్రితం వరకు కార్మికుడిగా పని చేశాడు. అప్పట్లో ఇంటికి వెళ్తానని క్వారీ సూపర్‌వైజర్ వద్ద తనకు రావాల్సిన డబ్బులు తీసుకొని పనుల్లోంచి వెళ్లిపోయి, తిరిగి రాలేదు. అనంతరం గత అక్టోబర్ నెలలో మొలంగూర్‌కు చెందిన మరో గ్రానైట్ క్వారీలో కార్మికుడిగా చేరాడు. అయితే వెంకటేశ్ తాగుడుకు బానిస కావడంతో నిత్యం తాగి పనులకు వచ్చేవాడు. దీంతో క్వారీ యాజమాన్యం అతనికి రావాల్సిన డబ్బులు చెల్లించి, అదే నెలలో పనుల్లోంచి తీసేశారు.

అయితే ఇతను స్వగ్రామానికి వెళ్లకుండా మొలంగూర్‌లోనే ఉండి నిత్యం తాగుతూ రోడ్డుపై పడిపోయేవాడు. ఈ క్రమంలో తాగుడుకు తోడు సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం చెడిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గురువారం రాత్రి తాగి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తి తెల్లవారినా నిద్ర లేవకపోయేసరికి అనుమానంతో స్థానికులు పరిశీలించారు. అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్, ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానికులను విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి సమీప బంధువు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles