‘స్మార్ట్‌' పనుల్లో వేగం పెంచాలి

Wed,November 6, 2019 01:58 AM

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: నగరంలో స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్మార్ట్‌సిటీ పనులపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ చొరవతో హైదరాబాద్‌కు బదులుగా కరీంనగర్‌ స్మార్ట్‌సిటీగా ఎంపికైందని తెలిపారు. స్మార్ట్‌లో భాగంగా 1, 2, 3 ప్యాకేజీ పనులను చేపట్టాలన్నారు. ప్యాకేజీ 1, 2లలో ఎనిమిది రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. పనుల ప్రగతిలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. ఆయా రోడ్లలో మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలకు షోకాజ్‌ నోటీసులు అందించి, వెంటనే వాటిని తొలగించాలన్నారు. దీనిలో భాగంగా మొదటి ప్రాధాన్యతగా కలెక్టరేట్‌ రోడ్డును మోడల్‌ రోడ్డుగా అభివృద్ధి చేయాలన్నారు. రోడ్డు అభివృద్ధిలో భాగంగా విద్యుత్‌ స్తంభాల తొలగింపు, పైపులైన్ల మార్పులు, కట్టడాలు, ఇతర తొలగింపు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ స్తంభాల తొలగింపు పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక ఏడీ, ఇద్దరు ఏఈలతో కూడిన ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ అధికారులకు సూచించారు. బల్దియా, ట్రాన్స్‌కో, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు.

ప్యాకేజీ 3లో భాగంగా హౌసింగ్‌బోర్డు కాలనీలో రూ.45 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులు పూర్తయితే నగరం సుందరంగా మారుతుందని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా నగరంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద 50 స్మార్ట్‌ క్లాస్‌ గదులను ఏర్పాటు చేస్తామన్నారు. కూరగాయల మార్కెట్లు, స్టేడియం ఆధునికీకరణతోపాటు టవర్‌సర్కిల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.25 కోట్లతో ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొత్త బ్లాకుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సర్కస్‌గ్రౌండ్‌, మల్టీపర్పస్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నెలరోజుల్లోగా ఈ పనులను పూర్తి చేయాలన్నారు. ఆ మేరకు కూలీలు, యంత్రాలను పెంచాలని సూచించారు. నగరానికి ఎనిమిది ఎకరాల్లో డంపింగ్‌ యార్డు ఉందనీ, ప్రస్తుతం ఇది పూర్తిగా చెత్తతో నిండిపోయిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన విధానం ద్వారా డంపింగ్‌యార్డులోని మొత్తం చెత్తను తొలగించి, తక్కువ స్థలంలో చెత్తను పవర్‌, గ్యాస్‌గా మార్చేందుకు అవసరమైన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరంలో 24 గంటల మంచినీటి సరఫరాకు సంబంధించి చర్యలు చేపట్టాలన్నారు. గాంధీరోడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇక్కడ కలెక్టర్‌ సర్ఫరాజ్‌అహ్మద్‌, బల్దియా కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, మార్కెటింగ్‌, మెప్మా, డీఎస్డీవో, ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నగరాన్ని సుందరంగా మారుస్తాం
రోడ్ల అభివృద్ధి పనులన్నీ పూర్తిచేసి, నగరాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి కమాన్‌ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన నిధులతో చేపడుతున్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులన్నీ కూడా తుది దశకు వచ్చాయన్నారు. వన్‌ టౌన్‌ నుంచి కమాన్‌ వరకు రోడ్డు విస్తరణకు సంబంధించి కోర్టు వివాదాలు ఉండడం వల్ల ఆలస్యమైందని తెలిపారు. దీనిపై స్థానికులతో మాట్లాడి వివాదాలు లేకుండా చేశామన్నారు. దీంతో ప్రస్తుతం ఈ రోడ్డులో మరో 20 ఫీట్ల వెడల్పు అవుతుందన్నారు. సిక్కులు రోడ్డు మధ్యలో ఉన్న వారి పవిత్ర స్తూపాన్ని చౌరస్తాలోకి మార్చేందుకు అంగీకరించడం అభినందనీయమన్నారు. ప్రధానరోడ్ల అభివృద్ధితోపాటు నగరంలోని అంతర్గత రోడ్ల అభివృద్ధికి కూడా సీఎం కేసీఆర్‌ రూ.350 కోట్లు మంజూరు చేశారన్నారు. వీటితో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. అలాగే, ఐటీ టవర్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. బల్దియా కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, నగరపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles