మన రాష్ట్రంలోనే ‘మద్దతు’

Wed,October 23, 2019 02:14 AM

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ/ కరీంనగర్‌ రూరల్‌ : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం తేమ శాతం పరిశీలించి, ఎలాక్ట్రానిక్‌ యంత్రంపై ధాన్యం తూకం వేశారు. ధాన్యానికి 24 శాతం తేమ రావడంతో మిషన్‌తో కోసిన వెంటనే ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకు రావడం వల్ల ఇబ్బందులు వస్తాయని తెలిపారు. కల్లం వద్దనే ఆరబెట్టి తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేదనీ, స్థలం సరిపోదనీ, ఇతర రైతులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. తేమ 17 శాతం వచ్చిన తరువాత తీసుకువచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న రూ.1835 ధర పొందాలన్నారు.

ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే ధాన్యం ఎట్టి పరిస్థితిలోనూ కోనుగోలు చేయమనీ, అందుకు జిల్లా సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామనీ, రైతు సమన్వయ సమితులు కూడా నియంత్రించాలన్నారు. రైతుల పంటల వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉంటుందనీ, దానిని బట్టి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు అధికారులు సహకారించాలని కోరారు. జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డీసీఎంఎస్‌లతో పాటు ఈసారి కొత్తగా హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఐదు వేల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు ఉన్న గ్రామాలకు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో 55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాల్సి వస్తుందని ప్రభుత్వం అధికారులతో అంచనా వేసిందనీ, అందుకు అనుగుణంగా గన్నీ బ్యాగులు సిద్ధం చేశారనీ, రైతులు దశల వారీగా వచ్చి విక్రయించాలనీ, ఒకేసారి వచ్చి ఇబ్బంది పడద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జాయింట్‌ కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌, జిల్లా మార్కెటింగ్‌ డీడీ పద్మావతి, జిల్లా సహకారశాఖ అధికారి శ్రీమాల, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌, కరీంనగర్‌ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్‌, కరీంనగర్‌ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌ తోట రమేశ్‌, దుర్శేడ్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ మంద రాజమల్లు, జడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్‌, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, వై సునీల్‌రావు, సుంకిశాల సంపత్‌రావు, దబ్బెట రాజేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles