గ్రామాల అభివృద్ధే ‘రూర్బన్‌' లక్ష్యం

Wed,October 23, 2019 02:13 AM

జమ్మికుంట/ ఇల్లందకుంట: గ్రామాల సమగ్ర అభివృద్ధే రూర్బన్‌ పథకం లక్ష్యమనీ, పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దాలని రూర్బన్‌ పథకం జాయింట్‌ కమిషనర్‌ వీరారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన జమ్మికుంటకు వచ్చారు. ముందుగా ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి, జమ్మికుంట మండలం పెద్దంపల్లి, శాయంపేట గ్రామాలను సందర్శించారు. రూర్బన్‌ పథకం నిధులతో చిన్నకోమటిపల్లిలో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అలాగే పెద్దంపల్లిలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను చూశారు. శాయంపేటలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను చూశారు. అక్కడి మహిళల అభిప్రాయాలు విన్నారు. యూనిట్‌ పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళలు సాధిస్తున్న ఆర్థికాభివృద్ధిపై ఆరా తీశారు. ప్రభుత్వం, అధికారులు అందిస్తున్న సహాయ, సహకారాలపై చర్చించారు. తర్వాత జమ్మికుంట పట్టణంలోని మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాయింట్‌ కమిషనర్‌ మాట్లాడారు. ఉమ్మడి జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్‌ క్లస్టర్‌గా రూర్బన్‌ మిషన్‌ పథకం ప్రారంభమైందని గుర్తుచేశారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రూర్బన్‌ కింద కేంద్ర ప్రభుత్వం రూ.30కోట్లు మంజూరు చేసిందనీ, ఇప్పటికే రూ.9కోట్లు విడుదలయ్యాయని చెప్పారు.

అధికారులు ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు పంపించిన విషయాలను గుర్తుచేశారు. సదరు పనులపై మరోసారి స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని సూచించారు. అత్యవసర పనులను ముందుగా గుర్తించాలని తెలిపారు. పనులను వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజల సమన్వయంతో పనులుండాలన్నారు. వచ్చే యేడాది మార్చి 31కల్లా రూర్బన్‌ కింద ఎంపికైన గ్రామాల్లో పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ల చొరవతోనే ఉమ్మడి జమ్మికుంట మండలం రూర్బన్‌ పథకం కింద ఎంపికైందనీ, వారి రుణం తీర్చుకోలేనిదని జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ పేర్కొన్నారు. జాయింట్‌ కమిషనర్‌ వెంట డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల ఎంపీపీలు మమత, పావని, జడ్పీటీసీ డాక్టర్‌ శ్యాం, తాసిల్దార్‌లు డాక్టర్‌ నారాయణ, సురేఖ, ఎంపీడీవోలు జయశ్రీ, స్వరూప, పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles