పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుతాం

Wed,October 23, 2019 02:13 AM

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుతామనీ, ఇందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం నగరంలోని రోడ్ల స్వీపింగ్‌ కోసం తీసుకువచ్చిన అధునాతన స్వీపింగ్‌ యంత్రాల పనితీరును తెలంగాణచౌక్‌లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియోజకవర్గ పరిధిలోని నగరంతోపాటుగా మండలాల్లోని రోడ్లను శుభ్రం చేసేందుకు గతంలోనే ఈ యంత్రాల కోసం ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం 1.10 కోట్ల విలువైన రెండు అత్యాధునికమైన యంత్రాలు వచ్చాయనీ, ఇవి జర్మన్‌ టెక్నాలజీతో పని చేస్తాయని చెప్పారు. ఇందులో పెద్ద యంత్రాన్ని మల్టీపర్పస్‌ యూజ్‌ చేస్తారనీ, మరో చిన్న యంత్రాన్ని స్వీపింగ్‌ కోసం వాడుతారని తెలిపారు.

ప్రస్తుతం ఈ యంత్రాలు మండలానికి వచ్చాయనీ, కానీ, బల్దియా ఆర్డర్‌ ఇచ్చిన యంత్రాలు వచ్చే వరకు వీటిని నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లను శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. నిత్యం నగరంలో పారిశుధ్య నిర్వహణకు పెద్ద సంఖ్యలో కార్మికులను వినియోగిస్తున్నా రోడ్లు పరిశుభ్రం కావడం లేదనీ, ఇక నుంచి యంత్రాల ద్వారా స్వీపింగ్‌తో రహదారులన్నీ క్లీన్‌గా ఉంటాయన్నారు. త్వరలోనే నగరంలోని ప్రధాన రహదారులకు ఫైనల్‌ కోటింగ్‌ పనులు చేపట్టి ఎప్పటికీ రోడ్లపై మట్టి, దుమ్ము లేకుండా చూస్తామన్నారు. రానున్న పదిహేను రోజులపాటు రోడ్ల పనులు సాగుతాయన్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా నగర రోడ్లు ఇకపై అద్దంలా మెరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి శ్రీలత, టీఆర్‌ఎస్‌ నాయకులు వై సునీల్‌రావు, బుచ్చిరెడ్డి, ఎడ్ల అశోక్‌, పెద్దపల్లి రవీందర్‌, గందె మాధవి, పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లు, అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు, రూట్‌ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles