కోతల వెంటే కొనుగోళ్లు

Tue,October 22, 2019 06:10 AM

-నేటి నుంచే మొదలు
-కరీంనగర్, హుజూరాబాద్‌లో ప్రారంభించనున్న మంత్రులు
-ప్రస్తుతం 211 కేంద్రాలు
-మరో 6 కేంద్రాలకు ప్రతిపాదనలు
-అన్ని ఏర్పాట్లు చేశాం : జేసీ

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)వరికోతలు మొదలవుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం 211 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు కొనుగోలు కమిటీ కన్వీనర్, జేసీ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. ఇందులో 15 డీసీఎంఎస్, 65 ఐకేపీ, 129 ప్యాక్స్, ఒకటి హాకా, మరొకటి మెప్మా ఏజెన్సీలుగా కేంద్రాలను నిర్వహిస్తున్నామనీ, మరో ఆరు కేంద్రాలకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. కాగా, జిల్లాలో 4.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగినట్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో నిర్వహించిన మొత్తం కేంద్రాలను ప్రస్తుతం దశల వారీగా ప్రారంభించాలని నిర్ణయించారు. వీణవంక, కరీంనగర్‌రూరల్, మానకొండూర్, తదితర మండలాల్లో ముందుగా నాట్లు వేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ముందుగా వరి కోతలు జరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈసారి 170 కేంద్రాలతోనే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ, ధాన్యం అంచనాలకు మించి వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు 211కు పెంచారు.

పకడ్బందీ ఏర్పాట్లు
కొనుగోలు కమిటీ కమిటీ కన్వీనర్, జేసీ శ్యాంప్రసాద్‌లాల్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అవసరాన్ని బట్టి ప్రారంభిస్తున్న 211 కేంద్రాల్లో ప్రతి ఐదింటికి ఒక అధికారిని పర్యవేక్షకులుగా నియమించారు. 63 మంది వ్యవసాయ విస్తరణ అధికారులకు ధాన్యం నాణ్యతను నిర్ధారించే బాధ్యతలు అప్పగించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, సహకార, వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయిస్, తూనికలు, కొలతల శాఖల్లో ఎవరి విధులు వారికి అప్పగించారు. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం జిల్లాకు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా నిఘా వేసేందుకు పోలీసులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు వెళ్లే ఒక్కో వాహనానికి ఒక్కో అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయపర్చేందుకు శాతవాహన పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. దీంతో పర్యవేక్షణ సులువుగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని కేంద్రాలకు ప్రతిపాదనలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరిన్నింటికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో గంగాధర మండలం మల్లాపూర్, గోపాల్‌రావుపల్లి, చొప్పదండి మండలం కోనేరుపల్లి, చిట్యాలపల్లి, దేశాయ్‌పేట, రామడుగు మండలం కొరటపల్లి, గన్నేరువరం మండలం ఖాసింపేట, పారువెల్ల, హన్మాజీపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు వ్యవసాయ శాఖ ఫిజిబులిటీ కోసం పంపించారు. అయితే వీటిలో అవసరాన్ని బట్టి తెరిచేందుకు అధికారులు నిర్ణయించారు..

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి
- జేసీ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్
జిల్లాలో అవసరమైన చోటల్లా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో సివిల్ సప్లయ్ అధికారులు, జిల్లా వ్యవసాయశాఖ, జిల్లా సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 211 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామనీ, ప్రతి కొనుగోలు కేంద్రంలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రం, లీగల్ మెట్రాలజీ స్టాంప్, టేబుల్, కుర్చీలు, లైట్లు, గన్నీ బ్యాగుల స్టోర్ రూం, టార్ఫాలిన్లు, తేమ యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలూ కల్పించాలన్నారు. ధాన్యం కుప్పలు పోయకుండా చూడాలనీ, ఇంటివద్దే రైతులు ధాన్యం తేమ లేకుండా ఆరబెట్టి తీసుకువచ్చేలా చూడాలని సూచించారు.

రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం వేసి మద్దతు ధర చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లులకు వెళ్లగానే వెంటనే అన్‌లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజువారి కొనుగోళ్లలో నివేదికలు వెంట వెంటనే పంపించాలనీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వ్యవసాయశాఖ ఏఈఓల సాహకారం తీసుకోవాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వీ శ్రీధర్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల, మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి, మెప్మా పీడీ పవన్‌కుమార్, డీఆర్‌డీఎ ఏపీడీ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, పౌరసరఫరాలు, కార్మిక, డీసీఎంఎస్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles