పాడి రైతుకు దన్ను

Mon,October 21, 2019 01:17 AM

-జిల్లా పశు సంవర్ధక శాఖ వినూత్న ప్రయోగం
-నగరంలో క్లిఫ్స్ పేరుతో శిక్షణ కేంద్రం
-రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు
-గొర్రెల పెంపకందారులకు సైతం నిర్వహణ
-ఆమోదించిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మనిషి నిత్య ఆహారంలో మాంసం, పాలు, గుడ్ల అవసరం నానాటికి పెరుగుతోంది. రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి అవసరానికి మించి జరుగుతోంది. మాంసం, పాల ఉత్పత్తిలో నేటికీ స్వయం సంవృద్ధి సాధించ లేక పోతున్నాం. మాంసకృత్తులు ఎక్కువగా లభించే ఆహారాలైన మాంసం, పాలు, ఎక్కువగా పశువులు, గొర్రెలు, మేకల నుంచే లభిస్తున్నాయి. జాతీయ పోషక ఆహార సంస్థ వెల్లడించే నివేదికల ప్రకారం సాధారణ స్థాయి వ్యక్తి రోజుకు కనీసం పావు లీటరు పాలు లేదా పాలతో తయారైన పదార్థాలు తినాలి. మాంసం, చికెన్, చేపల నుంచి లభించే మాంసకృతులు నెలకు కనీసం కిలో వరకు తినాలి. అలాగే వారానికి మూడు కోడిగుడ్ల చొప్పున కనీస ఆహారంగా తీసుకోవాలి. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక మనిషి ఏడాదిలో 85 కోడి గుడ్లు తింటున్నాడు. 9 కిలోల మాంసం మాత్రమే తింటున్నారు. పాలు కూడా అనుకున్న మోతాదులో లభించడం లేదు. దీనికి ప్రధాన కారణం డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేక పోవడమే. ఈ పరిస్థితిని అధిగ మించాలంటే రెండు మార్గాలుగా చెప్పవచ్చు. మొదటిది పాడి పశువులు, మాంసం లభించే పశువుల సంఖ్యను పెంచడం.

రెండోది ఉన్న పశువుల్లో ఎక్కువ ఉత్పాదకాలు సాధించడం. ఇప్పుడు జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే 83,732 తెల్ల, 1,00,821 నల్ల జాతి పశువులు ఉన్నాయి. 4,10,503 గొర్రెలు ఉండగా ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ గొర్రెలు మరో 2,58,468 వరకు ఉన్నాయి. మేకలు మరో 83,014 వరకు ఉన్నాయి. వీటి ద్వారా ఇటు పాలు, అటు మాంసకృత్తులను ఆశించిన స్థాయిలో పెంచుకునేందుకు ఆధునిక పోషణ పద్ధతులపై పాడి రైతులకు, గొర్రెల పెంపకందారులకు శిక్షణ అవసరమని పశుసంవర్ధక శాఖ అధికారులు భావించారు. దీనిపై ఒక నివేదికను రూపొందించిన జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి అశోక్‌కుమార్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు నివేదించారు. దీనిని పలు మార్లు పరిశీలించిన కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో శిక్షణ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారు.

క్లిఫ్స్ పేరుతో శాశ్వత శిక్షణ కేంద్రం
కంటిన్యూయింగ్, లెర్నింగ్ ఆఫ్ ఇంటెన్సివ్ ఫామింగ్ స్కిల్స్ (క్లిఫ్స్) పేరుతో జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని సమాచార ప్రదర్శన కేంద్రంలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. జిల్లాలో పాడి, మాంసం ఉత్పాదకాలను పెంచాలంటే ఈ శిక్షణ తప్పనిసరి అని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ భావిస్తున్నారు. జిల్లాలో 15 నెలల కాలంలో సుమారు 150 కోట్ల సబ్సిడీతో రెండు పథకాలు అమలు చేశారు. ఇందులో 50 నుంచి 75 శాతం సబ్సిడీతో 4,174 పాడి పశువులను, 75 శాతం సబ్సిడీతో 13,002 (2,58,468 గొర్రెలు) గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఇంత ఖర్చు చేసి పాడి పశువులను, గొర్రెలను పంపిణీ చేస్తున్నప్పటికీ ఆశించిన పాలు, మాంసం ఉత్పత్తులు లభించక పోవడానికి కారణం ఇటు పాడి రైతులకు, అటు గొర్రెల పెంపకందారులకు ఆధునిక పద్ధతులపై అవగాహన లేక పోవడమేనని పశు సంవర్ధక శాఖ అధికారులు భావిస్తున్నారు. పాడి పశువులు, గొర్రెల పెంపకం, ఆరోగ్య పరిరక్షణ, మేపు పద్ధతుల విషయంలో పశువుల రకాలను బట్టి యాజమాన్య పద్ధతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు, పెంపకందారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. నగరంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఉన్న సమాచార ప్రదర్శన కేంద్రంలో ఈ శిక్షణను త్వరలో ప్రారంభిస్తామని జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి అశోక్ కుమార్ తెలిపారు.

ప్రతీ నెలలో రెండు రోజులు శిక్షణ
ప్రతీ నెలలో రెండు రోజులు శిక్షణ నిర్వహించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక రోజు పాడి పశువుల గురించి, మరొక రోజు గొర్రెల పెంపకం గురించి నిర్వహిస్తారు. ప్రతి బ్యాచ్‌లో 15 నుంచి 20 మందికి మించకుండా ఈ శిక్షణ కొనసాగిస్తారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారికే కాకుండా కొత్తగా పాడి, గొర్రెల పెంపకం రంగంలోకి అడుగు పెడుతున్న వారికి శిక్షణ ఇస్తారు. శిక్షణకు హాజరయ్యే వారికి బస్సు చార్జీల కింద రూ.50 చెల్లిస్తారు. రూ.100 విలువైన శిక్షణ సమాచారాన్ని కూడా అందిస్తారు. శిక్షణ పూర్తి చేసిన రైతులకు సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేస్తారు. పాడి పశువుల పెంపకం, పశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషణ, యాజమాన్య పద్ధతులు, గొర్రెల పెంపకందారులకైతే వాటి పెంపకం, ఆరోగ్య పరిరక్షణ, మేపు పద్ధతులు, సాంధ్ర పద్ధతుల్లో పెంపకం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఒక్కో వారంలో ఒక్కో అంశంపై శిక్షణ ఉంటుంది. ఒక పాడి రైతుగానీ, ఒక గొర్రెల పెంపకందారుడుగాని మూడు సార్లు శిక్షణ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

జిల్లా స్థాయిలో పశు పోషణలో, గొర్రెల పెంపకంలో అనుభవం ఉన్న వారిని, పశు సంవర్ధక శాఖలో నిపుణులైన వారితో శిక్షణ ఇప్పిస్తారు. జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం, జగిత్యాల జిల్లా కోరుట్లలోని పశు వైద్య కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రతి శిక్షణకు రూ.6 వేలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అంటే ఏడాదికి రూ.1.44 లక్షలు మాత్రమే శిక్షణకు ఖర్చు చేయబోతున్నారు. ఈ నిధులు ఇచ్చేందుకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా ఆమోదం తెలిపారు.

శిక్షణతో ఉపయోగాలు
సంప్రదాయ పద్ధతుల్లో పశువుల పెంపకానికి ఆధునికత జోడించడం ద్వారా అందుబాటులో ఉన్న పాడి పశువుల ద్వారా ఉత్పాదకాలు ఏ విధంగా పెంచుకోవాలో రైతులకు శిక్షణ కేంద్రంలో అవగాహన కల్పిస్తారు. శిక్షణ పొందిన రైతుల ద్వారా ఇప్పుడు వస్తున్న ఉత్పత్తుల కంటే 15 నుంచి 20 శాతం అధికంగా సాధించే అవకాశాలు ఉంటాయని పశు సంవర్ధక శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో పశు పోషణను రైతులు వదిలేయకుండా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఎక్కువ ఉత్పత్తి సాధించి మాంసం, పాలను ఆర్థికపరమైన అవసరాలకు అమ్ముకోవచ్చు. ఈ రెండు ఆహార పదార్థాలు పెరిగి పెద్ద మొత్తంలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ రంగంలో కొత్తగా అడుగిడాలనుకునే వారికి సందేహాలు ఉండవు. వారికి ఎంతో ప్రోత్సాహకం లభిస్తుందని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles