ముగిసిన ఆర్మీ ర్యాలీ

Fri,October 18, 2019 01:34 AM

-ప్రశాంతంగా రిక్రూట్‌మెంట్
-వెల్లువెత్తిన యువజనోత్సాహం
-గతం కంటే అధిక సంఖ్యలో యువత అర్హత
-24 వరకు కొనసాగనున్నవైద్య పరీక్షలు
-సౌకర్యాల కల్పనపై ఆర్మీ అధికారుల సంతోషం

కరీంనగర్ స్పోర్ట్స్: నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో పది రోజుల పాటు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ గురువారంతో ప్రశాంతంగా ముగిసింది. ఇటీవల వరంగల్, కొత్తగూడెం జిల్లాల్లో నిర్వహించిన ఆర్మీ ర్యాలీల కంటే అధిక సంఖ్యలో యువకులు హాజరయ్యారు. ర్యాలీ ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నప్పటికీ దీనిపై ఎలాంటి ప్రభావమూ పడలేదు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల్లో 80 శాతం యువకులు ర్యాలీలో పాల్గొన్నట్లు అధికారులు ప్రకటించడం గమనార్హం. ఈ నెల 7న ప్రారంభమైన ర్యాలీ 17తో ముగిసింది. పది రోజుల పాటు జరిగిన ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 46,734 మంది యువకులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా, 39,200 మంది పాల్గొన్నారు.

చెన్నై హెడ్‌క్వార్టర్స్ పరిధిలోని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం (ఏఆర్‌ఓ) ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో టెక్నికల్ గ్రేడ్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సిఫాయి ఫార్మ, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ ట్రేడ్‌మెన్ విభాగంలో ఎంపికల కోసం అర్హత పరీక్షలు నిర్వహించారు.

ప్రతిరోజూ సుమారు నాలుగు వేల మంది యువకులకు పది రోజుల పాటు అర్హత పరీక్షలు నిర్వహించారు. 1600 మీటర్ల పరుగుపందెంలో సుమారు 8100 మంది యువకులు అర్హత సాధించగా శారీరక, ఇతరత్రా పరీక్షలు పూర్తయ్యే వరకు 5000 మంది వైద్య పరీక్షలకు ఎంపికైనట్లు తెలిసింది. 1600 మీటర్ల పరుగు పందెంలో అధిక సంఖ్యలో యువకులు అర్హత సాధించలేకపోయారనీ, పరుగును నిర్ణీత సమయంలో పూర్తిచేసిన వారు మాత్రం ఇతర పరీక్షలను సులువుగా అధిగమినంచినట్లు అధికారులు వెల్లడించారు. శారీరక, ఇతర అర్హత పరీక్షలను పూర్తిచేసిన అభ్యర్థులకు ఈ నెల 24 వరకు దశలవారీగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువకులు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు నగరానికి రావడంతో స్టేడియంతో పాటు కలెక్టరేట్, రెవెన్యూ గార్డెన్, బస్టాండ్ ఏరియాల్లో యువకులతో సందడిగా మారింది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన యువకులకు ఢిల్లీ ఢిఫెన్స్ అకాడమీ బాధ్యులు పది రోజుల పాటు యువకులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించి ఉదారతను చాటుకున్నారు. 10 రోజుల పాటు నిర్వహించిన ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగకుండా ప్రశాంతంగా జరుగడం పట్ల ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారులు, జిల్లా అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles