87 వైన్స్‌లు.. 1,346 దరఖాస్తులు

Thu,October 17, 2019 02:04 AM

-జిల్లాలో మద్యం దుకాణాలకు పోటాపోటీ
-నాన్ రిఫండబుల్ ఫీజు పెరిగినా తగ్గని వ్యాపారులు
-గతంతో పోలిస్తే 262 అదనం
-ఒక్క చివరి రోజే 728 దాఖలు

రాష్ట్ర సర్కారు ఈ నెల 3న కొత్త మద్యం పాలసీని విడుదల చేసింది. రెండేళ్ల కాలపరిమితికి (నవంబర్ ఒకటి నుంచి 2020 అక్టోబర్ 10) గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,216 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు లక్ష నుంచి 2లక్షలు కాగా, జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం లైసెన్స్ ఫీజు నిర్ణయించింది. కొత్తగా నాలుగు నుంచి ఆరు స్లాబులకు పెంచింది. ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ సాగింది. ఆదివారం మినహా ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 4 గంటల్లోపు దరఖాస్తులు స్వీకరించగా, ఆశావహులు పెద్దసంఖ్యలో ఆసక్తి చూపారు. పోటాపోటీగా దాఖలు చేశారు. జిల్లాలో 87 మద్యం దుకాణాలకు 1,346 దరఖాస్తులు దాఖలయ్యాయి. గత నోటిఫికేషన్‌లో 1,084 దరఖాస్తులు రాగా, ఈ యేడాది 262 అదనంగా వచ్చాయి.

9వ తేదీ 15వ తేదీ వరకు నుంచి అంటే ఏడు రోజుల్లో 618 దరఖాస్తులు రాగా, చివరి రోజు బుధవారం 728 దరఖాస్తులు పడాయి. కరీంనగర్ అర్బన్ పరిధిలోని 21 మద్యం దుకాణాలకు 204, రూరల్ సర్కిల్‌లో 25 దుకాణాలకు 194, తిమ్మాపూర్ సర్కిల్‌లో 12 మద్యం దుకాణాలకు 128, హుజూరాబాద్‌లో 15 దుకాణాలకు 122, జమ్మికుంట సర్కిల్‌లో 14 దుకాణాలకు 80 దరఖాస్తులు వచ్చాయి. బుధవారం చివరి రోజు కావడంతో వ్యాపారుల పోటీ ఉంటుందని భావించిన అధికారులు ముందే టెంట్లు, షామియానాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు టోకెన్లు జారీ చేసిన అధికారులు టోకెన్లు పొందిన వ్యాపారుల దరఖాస్తులు రాత్రి 7.30 గంటల వరకు స్వీకరించారు. దరఖాస్తుల రూపంలో 26కోట్ల 92లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అత్యధిక దరఖాస్తులు..
కొన్ని దుకాణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలు చేశారు. అర్బన్ పరిధిలోని గెజిట్ నెంబర్ 5 దుకాణానికి 27 దరఖాస్తులు రాగా, రూరల్ సర్కిల్‌లోని గోపాల్‌రావుపేట మద్యం దుకాణానికి 36 దరఖాస్తులు వచ్చాయి. హుజూరాబాద్‌లోని మొలంగూర్ మద్యం దుకాణానికి 39 దరఖాస్తులు రాగా, ఇల్లందకుంట మద్యం దుకాణానికి 25 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా తిమ్మాపూర్ సర్కిల్‌లోని మానకొండూర్ మండలం గెజిట్ నెంబర్ 48 మద్యం దుకాణానికి 41 దాఖలయ్యాయి. తిమ్మాపూర్ సర్కిల్‌లోని హన్మాజీపల్లి మద్యం దుకాణానికి కేవలం 4 మాత్రమే చివరి రోజు దాఖలయ్యాయి. కరీంనగర్ రూరల్ పరిధిలోని చెర్లబూత్కుర్, బొమ్మకల్ మద్యం దుకాణాలకు చివరి రోజు ఐదు చొప్పున దరఖాస్తులు రాగా, మొగ్దుంపూర్ మద్యం దుకాణానికి 4 మాత్రమే వచ్చాయి.

పోటీ పడిన మహిళలు..
ఈ సారి మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు మహిళలు కూడా పోటీ పడ్డారు. 87 మద్యం దుకాణాలకు సుమారు 170 దాఖలు చేశారు. వీటిలో అత్యధికంగా అర్బన్ పరిధిలో 60, రూరల్, తిమ్మాపూర్ పరిధిలో 35 చొప్పున, హుజురాబాద్‌లో 30, జమ్మికుంట పరిధిలో 10 దరఖాస్తులు వేశారు.

రేపే డ్రా..
శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ఉండనున్నది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. దరఖాస్తుదారులకు ఎంట్రీ పాసులు వెంటనే జారీ జేశారు. ఎంట్రీ పాసు లేకుండా వస్తే లోనికి అనుమతించమని తెలిపారు. లక్కీ డ్రా రేపే తీయనుండగా, ఆశాహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఈ సారి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వైన్స్ దక్కుతుందో లేదోనన్న టెన్షన్ కనిపిస్తున్నది.

111
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles