కొత్త బల్దియాల్లోఎల్‌ఆర్‌ఎస్

Wed,October 16, 2019 02:10 AM

-ఉమ్మడి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో అవకాశం
-గతేడాది మార్చి30కి ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే అవుట్లకు చాన్స్
* నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
* జనవరి 15 వరకు గడువు
* విధివిధానాలు, ఫీజుల ఖరారు
* జీవో జారీ చేసిన మున్సిపల్ శాఖ
* భారీగా సమకూరనున్న ఆదాయం

కొత్త మున్సిపాలిటీల్లో అనుమతి లేని లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర సర్కారు అవకాశం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలోని కొత్తపల్లి, చొప్పదండి, ధర్మపురి, రాయికల్, మంథని, సుల్తానాబాద్ బల్దియాల పరిధిలో ఇది వర్తించనున్నది. గతేడాది మార్చి30కి ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే అవుట్లతోపాటు సెల్‌డీడ్ అయిన భూములను ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునే చాన్స్ ఉన్నది. ఈ మేరకు తాజాగా మున్సిపల్ శాఖ జీవో నెంబర్ 251 జారీ చేయగా, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలు కానున్నది. వచ్చే జనవరి 15 వరకు గడువు విధించగా, ప్రభుత్వ నిర్ణయంతో కొత్త బల్దియాలకు భారీగా ఆదాయం సమకూరనున్నది.

(కార్పొరేషన్, నమస్తే తెలంగాణ) :రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా 73 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయగా, ఆయా మున్సిపాలిటీల్లో పాత మున్సిపాలిటీల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతులను మంజూరు చేస్తున్నారు. అయితే పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అనుమతులు లేని లే అవుట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసే విషయంలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో కొత్త మున్సిపాలిటీల్లోనూ ఎక్కువ సంఖ్యలోనే అక్రమ నిర్మాణాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం)ను ప్రవేశపెట్టింది. పాత మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలో ఐదేళ్ల కిత్రమే ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం 2015 అక్టోబర్ 28 నాటికి రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరణ చేశారు. అయితే ఈ నిబంధనలే ప్రస్తుతం అమలులో ఉన్నాయి. దీంతో కొత్త మున్సిపాలిటీల్లో ఇబ్బందులు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీల కోసం జీఓ నంబర్ 251 ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 2018మార్చి30కి ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధికరించుకునేందుకు అవకాశం ఇచ్చారు.

మూడు నెలల వరకు గడువు..
ఎల్‌ఆర్‌ఎస్ పథకం ప్రకారం మున్సిపల్ అధికారులు బుధవారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పథకం 90 రోజుల పాటు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. అంటే వచ్చే జనవరి 15లోగా భూ యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా నిబంధనల మేరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఆయా లే అవుట్లను క్రమబద్ధీకరిస్తారు. దరఖాస్తులు చేసుకునే వారికి బెటర్‌మెంట్ చార్జీలు, డెవలప్‌మెంట్, లే అవుట్ సెక్యూరిటీ, జరిమానాలను కలిపి ఫీజును నిర్ణయిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తుతో పాటుగా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, లొకేషన్ ప్లాన్, సెక్యూరిటీ బాండ్, ఎన్‌ఓసీను జత చేసి ఆయా మున్సిపాలిటీల్లో అమలు చేయాల్సి ఉంటుంది. 2018 మార్చి 30కి ముందు రిజిస్ట్రేషన్, సెల్‌డీడ్ అయిన భూములకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. ఈ తేదీ అనంతరం రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లకు ఈ పథకం వర్తించదు.

ఉమ్మడి జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో అమలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఆరు మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలులోకి వస్తుంది. కరీంనగర్‌లోని కొత్తపల్లి, చొప్పదండి, పెద్దపల్లిలో మంథని, సుల్తానాబాద్, జగిత్యాలలో ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలులో ఉంటుంది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకుంటే ఆయా అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేపడుతారు. వాటికి అనుగుణంగానే భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు.‚

దరఖాస్తు ఫీజులు ఇలా..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో దరఖాస్తులన్నీ చార్జీలతో పాటు, జరిమానా కలిపి ఫీజును నిర్ణయిస్తారు. ఈ పథకంలో సాధారణ క్రమబద్ధీరణ ఫీజు కింద 100లోపు చదరపు మీటర్ల భూమికి ఒక చదరపు మీటర్‌కు 200 చొప్పున, 101 నుంచి 300లో వాటికి 400 చొప్పున, 301 నుంచి 500లోపు వాటికి 600 చొప్పున, 500 చదరపు మీటర్లకు పైగా ఉన్న భూములకు 750 చొప్పున, మురికివాడల్లో ఎంత చదరపు మీటర్లలో ఉన్నా కూడా 5 ఫీజు వసూలు చేయనున్నారు. వీటితో పాటు క్రమబద్ధీకరణ చార్జీలను ఆయా ప్రాంతాల్లోని భూమి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువను ఆధారంగా ఫీజుల శాతాన్ని విధించి వసూలు చేస్తారు. దీనిలో స్క్వేర్ యార్డుకు 3000లోపు మార్కెట్ విలువ ఉన్న వాటికి 20 చొప్పున, 3001 నుంచి 5000లోపు ఉన్న వాటికి 30 శాతం, 5001 నుంచి 10000లోపు వాటికి 40 శాతం, 10 వేల నుంచి 20 వేల లోపు వాటికి 50 శాతం, 20 వేల నుంచి 30 వేల లోపు వాటికి 60 శాతం, 30 వేల నుంచి 50 వేల లోపు ఉన్న వాటికి 80 శాతం, 50 వేలకు పైగా మార్కెట్ విలువ ఉన్న వాటికి 100 శాతం ఫీజులు విధిస్తారు.

బల్దియాలకు భారీగా ఆదాయం
ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ వల్ల కొత్త మున్సిపాలిటీలకు భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఆయా మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలోనే అనుమతి లేని లే అవుట్లు ఉండగా.. వీటిని క్రమబద్ధీకరణ చేస్తే మున్సిపాలిటీలకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉంది. కొత్త మున్సిపాలిటీల్లో ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల మూలంగా అనుమతులు ఇచ్చే విషయంలో ఇబ్బందులు వస్తుండగా... ఈ పథకం వల్ల భవన నిర్మాణాలకు అనుమతులు సులువుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు మున్సిపాలిటీలకు కూడా ఆదాయం రానున్నది.

సీఐటీడీ ఏర్పాటుకు ముందడుగు
* వినోద్ కుమార్ కృషి ఫలితం
* ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మంజూరు
* భవనం, స్థలం కేటాయింపునకు
కేంద్రం నుంచి ఇటీవలే లేఖ
* ఏర్పాటైతే జిల్లా యువతకు
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

టవర్‌సర్కిల్: స్మార్ట్‌సిటీగా మారిన కరీంనగరంలో ప్రతిష్టాత్మక జాతీయ ప్రాజెక్టుల ఏర్పాటుకు అడుగుపడుతున్నది. కరీంనగర్ మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రత్యేక చొరవతో ఇప్పటికే ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ ప్రాజెక్టు మంజూరైంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగా ఉన్న గిరిరాజ్ సింగ్ ఈ ప్రాజెక్టును మంజూరు చేయించగా, తాజాగా అందులో భాగమైన సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) ఏర్పాటుకు ముందడుగు పడింది. సీఐటీడీకి సంబంధించిన పనులను ప్రారంభించేందుకు 50 వేల చదరపు అడుగుల బిల్డింగ్, ఒకటిన్నర ఎకరాల స్థలం వెంటనే కేటాయించాలని కేంద్ర శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ డీ చంద్రశేఖర్ ఇటీవలే రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్‌రంజన్‌కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ ప్రాజెక్టులు ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

103
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles