ప్లాస్టిక్‌ విక్రయాలపై కొరడా

Sun,October 13, 2019 12:55 AM

హుజూరాబాద్‌టౌన్‌: పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చడంపై మున్సిపల్‌ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రజలను చైతన్యవంతం చేసేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టగా, ప్రస్తుతం ముమ్మరంగా తనిఖీలు చేస్తూ లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నది. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసుల వినియోగం ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్‌ 2 నుంచి దేశ వ్యాప్తంగా ఆయా ప్లాస్టిక్‌ ఉత్పత్తుల అమ్మకం, వాడకాన్ని నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయినా పట్టణంలో వీటి విక్రయాలు జోరుగా సాగుతుండగా మున్సిపల్‌ కమిషనర్‌ ఈసంపెల్లి జోన ఆకస్మికంగా దాడులతో కట్టడి చేస్తున్నారు. ఇప్పటికే పలు దుకాణాలకు మొత్తం రూ.35 వేలకు పైగా జరిమానా విధించారు. ఇలా కమిషనర్‌ తన సిబ్బందితో తరచుగా పట్టణంలోని పలు హాటళ్లు, బేకరీలను, చికెన్‌ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కవర్లకు ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులు, టిఫిన్‌ డబ్బాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా చికెన్‌ సెంటర్లకు టిఫిన్‌ బాక్స్‌ తీసుకొని వచ్చిన కొనుగోలుదారులకు కేజీకి రూ.10 తగ్గింపు ధర ఇవ్వాలని యజమానులకు సూచించారు. ఈ మేరకు ఫ్లెక్సీలు సైతం కట్టించారు. ఇటీవల ప్రజలతో ప్లాస్టిక్‌ నిషేధానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఇలా కమిషనర్‌ తీసుకుంటున్న పకడ్బందీ చర్యలతో పట్టణంలో, పురపాలక పరిధిలో 90 శాతం ప్లాస్టిక్‌ వినియోగం తగ్గడం విశేషం.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles