పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి అదాలత్

Sat,August 24, 2019 12:51 AM

టవర్‌సర్కిల్: పింఛనుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి పెన్షన్ అదాలత్ దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ట్రెజరీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్ అదాలత్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలకు సంబంధించి 25 కేసులు వచ్చాయనీ, ఇందులో 22 మంది పెన్షన్‌దారులు అదాలత్‌కు హాజరయ్యారని తెలిపారు. పెన్షన్ పొందడంలో తలెత్తే సమస్యలను పెన్షన్‌దారులు, ఫ్యామిలీ పెన్షనర్లు ఇక ముందు కూడా నిర్వహించే పెన్షన్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం జేసీ, జిల్లా ట్రెజరీ ఉప సంచాలకుడు కే శ్రీనివాస్, హైదరాబాద్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి వచ్చిన అకౌంట్స్ ఆఫీసర్ సత్యనారాయణ, డీటీఏ నాగరాజు, జిల్లా ఆడిట్ ఆఫీసర్ పీ రాము తదితర అధికారులు సమస్యలున్న పెన్షనర్లను, ఫ్యామిలీ పెన్షనర్లను వరుస క్రమంలో పిలిచి మాట్లాడారు. ఫిర్యాదులు స్వీకరించారు. అప్పటికప్పుడే వారి సమస్యలపై సంబంధిత శాఖల అధికారుల వివరణ తీసుకుని పరిష్కరించారు. పెన్షన్‌దారుల జటిలమైన సమస్యలను రెండు, మూడు రోజుల్లో పరిష్కరించి, పెన్షన్ క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. చివరగా పెన్షనర్ల సంఘాల నాయకులు నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. చిన్న చిన్న సమస్యలకు పెన్షనర్లు తనను స్వయంగా కలిస్తే పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా ట్రెజరీ ఉప సంచాలకుడు శ్రీనివాస్ తెలిపారు. ఇందులో పెన్షనర్ల సంఘాల నాయకులు మోసం అంజయ్య, కేశవరెడ్డి, పోశెట్టి, వివిధ శాఖల అధికారులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు పాల్గొన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles