పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

Sat,August 24, 2019 12:51 AM

కరీంనగర్ హెల్త్ : ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ, వార్డులు, వెల్‌నెస్ సెంటర్, నర్సింగ్ పాఠశాల, ఎంసీహెచ్‌లో కలియ దిరిగారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పేద ప్రజలు ప్రభుత్వ దవాఖానను నమ్ముకుని వైద్యం కోసం వస్తుంటారనీ, కేవలం భవనాలకు, హంగు, ఆర్బాటాలకే కాకుండ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేయాలన్నారు. రోగులకు అనుకూలంగా భవనాలు నిర్మించాలన్నారు. ఐసీయూలో ఏసీలు పనిచేయడం లేదనీ, వెంటిలేటర్లు ప్రజలకు అందుబాటులో లేవనీ, వీటిని మరమ్మతు చేయించాలని వైద్యాధికారులకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దవాఖాన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయన్నారు. దవాఖానలో పనిచేసే కార్మికులకు లేబర్ యాక్టు ప్రకారం వేతనాలు చెల్లించాలని ఎజిల్ గ్రూపు సంస్థ ప్రతినిధులకు సూచించారు. దవాఖాన సమస్యలపై సెప్టెంబర్ మొదటి వారంలో కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తాననీ, దీనికి సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఇకపై ప్రతి 15 రోజులకొకసారి దవాఖానను పరిశీలిస్తానన్నారు.

దవాఖానకు అంబులెన్స్‌ను సమకూరుస్తామన్నారు. నర్సింగ్ పాఠశాలలోని విద్యార్థినులు తాగునీటి సమస్య ఉందని ఎంపీకి విన్నవించగా, వెంటనే స్పందించి ఆర్‌వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పాఠశాలలోని విద్యార్థులు ప్రతి సంవత్సరం ఔట్‌రిచ్ కోసం మూడు నెలల పాటు ఫీల్డ్‌కు వెళ్లాల్సి ఉందనీ, వారికి ఒక వాహనం సమకూర్చాలని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. నెలలోపు నర్సింగ్ పాఠశాల సమస్యలన్నీ పరిష్కరిస్తాననీ, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్ రమబాయికి సూచించారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వెల్‌నెస్ సెంటర్‌లో రక్త పరీక్షలు ఇక్కడే చేసేలా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీధర్, ఇంజినీరింగ్ అధికారులు, వైద్యులు, సిబ్బంది, బీజేపీ నాయకులు డాక్టర్ పుల్లెల పవన్‌కుమార్, ఎన్నం ప్రకాశ్, తదితరులున్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles