కొనసాగుతున్న ఎత్తిపోతలు

Mon,August 19, 2019 01:22 AM

- లింక్-2లో గంగమ్మ పరవళ్లు
- నంది, గాయత్రి పంప్‌హౌస్‌లో నిరంతరాయంగా నడుస్తున్న మోటర్లు
- నిండుగా ప్రవహిస్తున్న వరదకాలువ
- మధ్యమానేరుకు గోదావరి జలాలు
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/రామడుగు/ధర్మారం : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఆరు, ఏడు, ఎనిమిది ప్యాకేజీల్లో గంగమ్మ ఉప్పొంగుతున్నది. ఎల్లంపల్లి జలాశయం నుంచి మధ్యమానేరు జలాశయం దాకా పరవళ్లు తొక్కుతున్నది. గురువారం రాత్రి నుంచి ఆరో ప్యాకేజీ ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌లోని 1, 2, 3 మోటార్లతో నీటిని ఎత్తిపోస్తూ ఏడో ప్యాకేజీ నంది రిజర్వాయర్‌ను నింపుతున్న అధికారులు, తాజాగా ఆదివారం 2, 4 మోటర్ల ద్వారా ఎత్తిపోశారు. ఇక్కడి నుండి ఒకవైపు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఎగువ ప్రాంతానికి 500 క్యూసెక్కుల చొప్పున సరఫరా అవుతుంది. మరోవైపు రిజర్వాయర్ నుండి ఆరు గేట్లు ఎత్తి జంట సొరంగాల ద్వారా ఎనిమిదో ప్యాకేజీ కరీంనగర్ జిల్లా రామడుగు గాయత్రి పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్‌లో గత వారం రోజుల నుంచి రెండు బాహుబలి మోటర్లను దఫాల వారీగా వెట్ ట్రయల్ రన్ చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12గంటల నుంచి ఐదో మోటర్, రాత్రి 7గంటల నుంచి నాలుగో మోటర్ నిరంతరంగా నడిపిస్తూ, బోయినపల్లి మండలం మాన్వాడలోని మధ్యమానేరు జలాశయానికి నీటిని తరలిస్తున్నారు. పంపుహౌస్ డెలివరీ సిస్టర్న్‌తోపాటు, జంక్షన్ పాయింట్, వరదకాలువ గేట్ల వరకు నీటి ప్రవాహాన్ని వరదకాలువ ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ నూనె శ్రీధర్, డీఈ ప్రవీన్‌కుమార్‌తో కలిసి ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు నాలుగు, ఐదు మోటర్ల ట్రయల్న్ చేపట్టగా, సోమవారం ఒకటో మోటర్ వెట్ ట్రయల్న్ చేపట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయత్రి పంప్‌హౌస్ నుంచి వరదకాలువ ద్వారా ఆదివారం 6150 క్యూసెక్కులు మిడ్‌మానేరుకు చేరగా, ప్రాజెక్టులో మొత్తం 5.63 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు.

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles