చెరువుల్లోకి చేపపిల్లలు

Sun,August 18, 2019 01:14 AM

-జిల్లాలో పెంపకం షురూ..
-769 చెరువులు, కుంటల్లో పెంచేందుకు ప్రణాళిక
-2.24 కోట్ల లక్షల ఫిష్ సీడ్ సిద్ధం
-ఒక్క ఎల్‌ఎండీలోనే 30 లక్షలు..
-విడతల వారీగా విడుదల

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈసారి జిల్లాలో 2 కోట్ల 24 లక్షల 88 వేల చేప విత్తనాలను చెరువుల్లో వదలాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోని 8 వేల హెక్టార్ల నీటి విస్తీర్ణంలో 30 లక్షలు, నిత్యం నీటితో ఉండే 82 చెరువుల్లోని 1,743.5 హెక్టార్ల నీటి విస్తీర్ణంలో 34.88 లక్షలు, సీజనల్‌గా నీటి నిలువులు ఉండే 686 చెరువులు, కుంటల్లోని 9,261 హెక్టార్లలో 1.60 కోట్ల చేప విత్తనాలు వదిలేందుకు నిర్ణయించారు. ఈసారి ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ను కలుపుకుని 19,585.7 హెక్టార్ల నీటి విస్తీర్ణంలో చేపల పెంపకం చేపడుతున్నారు. ఇందులో రిజర్వాయర్‌తోపాటు నిత్యం నీటి లభ్యత ఉండే చెరువుల్లో 80-100 మిల్లీ మీటర్ల పొడవైనవి, సీజనల్ చెరువులు, కుంటల్లో 35-40 మిల్లీ మీటర్ల పొడవైన చేపలు వదులుతారు. ప్రస్తుతం చేపల సరఫరాలకు అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేప పిల్లలను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నట్లు మత్స్య శాఖ ఉప సంచాలకులు ఖాదిర్ అహ్మద్ తెలిపారు. ప్రస్తుతం 3.33 లక్షల చేప విత్తనాలను ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో వదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం చేప పిల్లల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ కూడా చేప పిల్లలను నీటిలో వదిలే కార్యక్రమం ప్రారంభించారు.

పూర్తి సబ్సిడీపై చేప పిల్లలు
మత్స్యకారుల సహకార సంఘాలకు ఎప్పటిలాగే ప్రభుత్వం పూర్తి సబ్సిడీపై చేప పిల్లలను పంపణీ చేస్తోంది. చెరువుల్లో వదిలేందుకు ఈసారి నాలుగు రకాల చేపలను ఎంపిక చేసుకున్నారు. ఇందులో నిత్యం నీళ్లు నిలిచి ఉండే చెరువుల్లో కట్ల, రాహు, మ్రిగాల రకాలు, స్వల్ప కాలికంగా నీళ్లు నిలిచే చెరువుల్లో కట్ల, రాహు, బంగారుతీగ జాతి చేపలను వదులుతున్నారు. వీటిలో పెద్ద చెరువుల్లో 80-100 మిల్లీ మీటర్లు ఉండేవి, చిన్న చెరువుల్లో 35-40 మిల్లీ మీటర్లు ఉండే పిల్లలను వదులుతున్నారు. 8-10 నెలల కాలంలో వీటిని పట్టుకునేందుకు వీలుంటుంది. అయితే 35-40 మిల్లీ మీటర్ల వాటిలో లక్ష చేపలకు రూ.45 వేలు, 80-100 మిల్లీ మీటర్లు ఉండే వాటిలో లక్ష చేపలకు రూ.1.06 లక్షల చొప్పున చెల్లించేందుకు కాంట్రాక్టర్ల నుంచి అగ్రిమెంట్ కూడా పూర్తయింది. జిల్లాలో 35-40 మిల్లీ మీటర్లు ఉండే చేప పిల్లలను 1.60 కోట్లు, 80-100 మిల్లీ మీటర్లు ఉండే చేపలు సుమారు 65 లక్షల చేప విత్తనాలను పూర్తి ఉచితంగా సరఫరా చేస్తున్నారు.

మత్స్యకారులకు ప్రయోజనం
జిల్లాలోని మత్స్యకారుల కుటుంబాలకు మరోసారి భారీ ప్రయోజనం చేకూరబోతున్నది. గతేడాది ప్రభుత్వం పూర్తి సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేసిన కారణంగా 7,498 టన్నుల చేపలు ఉత్పత్తయినట్లు మత్స్య శాఖ డీడీ ఖాదిర్ అహ్మద్ తెలిపారు. ఈసారి ఇంతకంటే అధిక మొత్తంలో చేపలు ఉత్పత్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా జిల్లాలో ఉన్న 171 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని 12,500 కుటుంబాలకు మరోసారి ప్రయోజనం కలుగబోతున్నది. ఆయకట్టు ప్రాంతంలో చెరువులు ఉన్న మత్స్యకారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో మరింత ప్రయోజనం కలుగబోతోంది. అలాగే ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో చేపలు పట్టుకుని జీవిస్తున్న 1,378 మత్స్యకార కుటుంబాలకు ఈసారి మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. కాళేశ్వరం జలాలు వస్తున్న ప్రస్తుత తరణంలో నీటి విస్తీర్ణం పెరగనుండగా, ప్రస్తుతం ఇందులో 8 వేల హెక్టార్ల్ల పరిధిలో చేప పిల్లలను వదులు తున్నారు. నీటి విస్తీర్ణం పెరిగితే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో ఈసారి 1,113 టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ రకంగానూ మత్స్య కారులకు మంచి ఉపాధి లభించనుంది.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles