శరవేగంగా ఆర్‌ఎఫ్‌సీఎల్

Wed,August 14, 2019 01:15 AM

-తుది దశకు కార్మాగారం నిర్మాణం
-వచ్చే డిసెంబర్‌కల్లా ఉత్పత్తే లక్ష్యం
-5254.28కోట్ల వ్యయంతో పనులు
-ఇప్పటికే 90శాతానికిపైగా పూర్తి
-ఆరు సంస్థల భాగస్వామ్యంతో ముందుకు
-రాష్ట్ర ప్రభుత్వానికి 11శాతం వాటా
-అందుబాటులోకి వస్తే రోజుకు 6,050 మెట్రిక్ టన్నుల ఎరువులు
పారిశ్రామిక ప్రాంతం పెద్దపల్లి జిల్లా సిగలో మరో నగ చేరబోతున్నది. రామగుండంలో మరో భారీ ప్రాజెక్టు అంకురార్పణకు వేళవుతున్నది. స్వరాష్ట్రంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల యూరియా అవసరాలు తీర్చడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు కంపెనీల భాగస్వామ్యంతో నగరంలో రామగుండం ఫర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) నిర్మాణం చివరి దశకు చేరింది. రోజుకు 6,050 మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తే లక్ష్యంగా 5,254.28 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ అతిపెద్ద ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 90శాతానికిపైగా పూర్తికాగా, వచ్చే డిసెంబర్ నుంచి ఉత్పత్తి మొదలు పెట్టడడమే లక్ష్యంగా యంత్రాంగం పరుగులు తీస్తున్నది.

(గోదావరిఖని,నమస్తే తెలంగాణ):రామగుండం ఎరువుల కార్మాగారం (ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎఫ్‌సీఐ) రెండు దశాబ్దాల క్రితం వరకు నడిచింది. బొగ్గు ఆధారితంగా పనిచేసిన ఈ ఎఫ్‌సీఐ భారీ నష్టాలతో బోర్డు ఫర్ ఇండస్ట్రీయల్ అండ్ ఫైనాన్షియల్ రీ కనస్ట్రక్షన్ (బీఐఎఫ్‌ఆర్)కు వెళ్లి మూతపడింది. దీంతో ఆ కార్మాగారం స్థానంలో మరో భారీ గ్యాస్ ఆధారిత ఎరువుల కార్మాగారం ఏర్పాటవుతున్నది. ప్రభుత్వరంగ అధీనంలో నిర్మితమవుతున్న రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్) త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. 2018 డిసెంబర్ నాటికే ప్రారంభించాలని ముందుగా ప్రయత్నించినా పలు కారణాలతో ఆగిపోయింది. ఈ క్రమంలో మరో యేడాది గడువు పొడిగించుకొని, ఈ డిసెంబర్ నుంచే యూరియా, అమ్మోనియా ఉత్పత్తి చేసే లక్ష్యంతో పనుల ప్రక్రియ సాగుతున్నది.

భారీ పెట్టుబడులతో ఆర్‌ఎఫ్‌సీఎల్..
5,254.28కోట్ల భారీ పెట్టుబడులతో నిర్మిస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను త్వరితగతిన పూర్తి చేసి రెండు తెలుగు రాష్ర్టాల యూరియా కొరతను తీర్చడంతో పాటు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గతంలో రామగుండంలో ఉన్న ఎరువుల కార్మాగారం నష్టాలలో కూరుకుపోవడంతో 1999లో మూసివేశారు. అప్పటి నుంచీ అతీగతి లేకుండా ఉన్న ఈ ఫ్యాక్టరీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో 2015 ఫిబ్రవరి 17న గ్యాస్ ఆధారిత ఎరువుల కార్మాగారంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో ఉన్న ఎఫ్‌సీఐ బొగ్గు ఆధారితంగా యూరియా ఉత్పత్తి చేసింది. సింగరేణి నుంచి బొగ్గు సరఫరా సరిగ్గానే జరిగినప్పటికీ విద్యుత్ కోతలు, అప్పుల భారం ఎక్కువకావడంతో కార్మాగారం గట్టెక్కడం కష్టమై, తీవ్ర నష్టాలతో బీఐఎఫ్‌ఆర్ పరిధిలోకి వెళ్లిన ఈ కార్మాగారం స్థానంలో అన్ని వనరులు ఉండడంతో అనువుగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులతోనైనా ఈ కార్మాగారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకొని శరవేగంగా నిర్మిస్తున్నది.

11శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా..
కొత్తగా ఏర్పాటు చేసే ఫ్యాక్టరీకి భారీగా పెట్టుబడులు అవసరం కావడంతో ఇందులో భాగస్వాముల సంఖ్య పెరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఎఫ్‌సీఐ ఆధీనంలో ఫ్యాక్టరీని నడిపారు. ఇప్పుడు భారీ పెట్టుబడుల కారణంగా ఆరుగురు భాగస్వామ్యంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను నెలకొల్పుతుంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వరంగ సంస్థలు ఎరువుల ఉత్పత్తిలో అనుభవమున్న సంస్థలను కలుపుకొని నిర్మిస్తున్న ఇందులో దాదాపు 550 కోట్లకు పైబడి పెట్టుబడులు పెట్టాలనీ, అవసరమైన సహాయసహకారాలు చేయాలని అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే గాక మరో ఐదు సంస్థలు వాటాలు కేటాయించారు. పాత కార్మాగారం రామగుండం ఎఫ్‌సీఐకి ఆస్తులకు సంబంధించి 11శాతం వాటాను కేటాయించారు. దీనికి తోడుగా నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌కు 26శాతం వాటాల చొప్పున 52 శాతం, మరో 11శాతం వాటా తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించారు. మిగతా వాటాలను గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కు 14.3శాతం, డెన్మార్క్‌కు చెందిన హాల్దర్ టాప్సేకు 11.7శాతం కేటాయించారు. మొత్తం 100శాతం వాటాలను జాయింట్ వెంచర్ కింద కేటాయించారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో వేగంగా పనులు..
ఎఫ్‌సీఐ స్థానంలో నెలకొల్పే గ్యాస్ ఆధారిత కార్మాగారాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనులను వేగంగా చేస్తున్నది. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌కు 2016ఆగస్టు 7న గజ్వేల్‌లో వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2016 సెప్టెంబర్ 14 నుంచి పనులు వేగవంతం చేశారు. ప్రతి రోజు 3,850మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తే లక్ష్యంగా పనులను శరవేగంగా చేస్తున్నారు. ఈ ప్లాంట్‌కు అవసరమైన 40 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి తీసుకోవాలని నిర్ణయించారు.

ఎల్లంపల్లి నుంచి జలాలు..
కేంద్ర ప్రభుత్వంకు చెందిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో తన వాటాను దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఫ్లాంట్‌కు అవసరమైన 0.5 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నుంచి తీసుకునేందుకు ఒప్పందం కుదరగా, ఇందుకు సంబంధించిన పైప్‌లైన్ పనులు నడుస్తున్నాయి. ఈ కార్మాగారానికి అవసరమైన గ్యాస్‌ను ఆంధ్రాలోని కేజీ బేసిన్ నుంచి తీసుకోవడానికి ఒప్పందం కాగా, ఇందుకు సంబంధించిన పనులూ చివరిదశకు వచ్చాయి. మరో కొద్ది నెలల్లోనే పూర్తయ్యే అవకాశాలున్నాయి. అమ్మోనియా ప్లాంట్‌ను డెన్మార్క్‌కు చెందిన హాల్ధర్ టాప్సే కంపెనీ నిర్మిస్తుండగా, ఈ కంపెనీకి 11.7శాతం వాటా కల్పించారు. యూరియా ఫ్లాంట్‌ను పూర్తిగా ఇటలీ దేశ పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. ఫ్యాక్టరీ పూర్తయిన తర్వాత మొత్తం 400 మంది పర్మినెంట్ కార్మికులతో పాటు మరో 1500 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ప్రస్తుతం తీవ్రమైన ఎరువుల కొరత ఉండగా, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో అందుబాటులోకి వస్తే ఎంతో ప్రయోజనం కలుగనున్నది. గతంలో ఎఫ్‌సీఐగా ఉన్న ఈ కార్మాగారానికి ఫ్యాక్టరీ స్థలంతో పాటు ఉద్యోగుల నివాసాల క్వార్టర్లు, ఆట స్థలాలు, గెస్ట్‌హౌస్‌లు ఉండడం వాటన్నింటిని ఆధునికీకరించి, అందుబాటులోకి తేనున్నారు.

మారనున్న ఈ ప్రాంత రూపురేఖలు..
రామగుండం ప్రాంతంలో గతంలో ఎఫ్‌సీఐ ప్యాక్టరీతో ఎంతోమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయి. అది మూతపడిన తర్వాత ఈ ప్రాంతం బోసిపోయింది. షాపింగ్ కాంఫ్లెక్స్‌లు, పార్కులు, ఇతర ప్రదేశాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. తిరిగి ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రారంభం కానుండడంతో ఈ ప్రాంతంలో మళ్లీ సందడి కనిపిస్తున్నది. గతంలో అమ్మితే కొనడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నుంచి ఈ ఏరియాలో స్థలాలు కొనడానికి, ఇండ్లు నిర్మించుకోవడానికి, షెటర్లు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువమంది ఉత్సాహం చూపుతున్నారు. మరో మూడు నాలుగు నెలల్లోనే ఫ్యాక్టరీ ఉత్పత్తి దశలోకి రానుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles