భళా బాహుబలి

Tue,August 13, 2019 03:02 AM

-దిగ్విజయంగా నాలుగు, ఐదు మోటర్ల వెట్ ట్రయల్న్
-ఎనిమిదో ప్యాకేజీ గాయత్రీ పంప్‌హౌస్‌లో ఎగిసినగంగ
-ప్రగతి భవన్ నుంచి సీసీ కెమెరాల ద్వారా వీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్
-లిఫ్ట్ అడ్వయిజర్, ఈఎన్‌సీకి సీఎం అభినందనలు
-నాలుగో మోటర్ నీళ్లను మిడ్‌మానేరుకు తరలించాలని ఆదేశం
-2.10గంటలపాటు ఉప్పొంగిన జలాలు
-గ్రావిటీ కెనాల్ ద్వారా పరవళ్లు -నాలుగు గంటల్లోపే మధ్యమానేరుకు చేరిన నీళ్లు -వరదకాలువ జంక్షన్‌పాయింట్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఈఎన్‌సీ
-ఆనందంలో ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులు


రామడుగు : కాళేశ్వరం చెంత అద్వితీయ జలదృశ్యం ఆవిష్కృతమైంది. కరువు నేలను సస్యశ్యామలం చేసే మహత్తర యజ్ఞంలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. రామడుగు మండలంలోని గాయత్రీ పంప్‌హౌస్‌వేదికగా బాహుబలి తన ఘనకీర్తిని చాటుతున్నది. ఆదివారం ఐదో మోటర్ వెట్ ట్రయల్న్ విజయవంతం కాగా, సోమవారం మధ్యాహ్నం మరోసారి ఐదు, రాత్రి నాలుగో మోటర్ ద్వారా నీటి ఎత్తిపోతల పరీక్ష గ్రాండ్ సక్సెస్ అయ్యింది. డెలివరీ సిస్టర్న్ నుంచి ఉప్పొంగిన గంగమ్మ గ్రావిటీ కెనాల్ ద్వారా వరద కాలువకు చేరడంతో ఇంజినీరింగ్ యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. భళా బాహుబలి అంటూ కీర్తించింది. అయితే అప్పటికే ప్రక్రియనంతా అపరభగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సీసీ కెమెరాల ద్వారా ప్రగతి భవన్ నుంచి వీక్షించి, లిఫ్ట్ అడ్వయిజర్ పెంటారెడ్డి, ఈఎన్సీ వెంకటేశ్వర్లును ప్రత్యేకంగా అభినందించారు. సీఎం ఆదేశాలతో నాలుగో మోటర్ ద్వారా వచ్చిన నీటిని మిడ్‌మానేరుకు విజయవంతంగా తరలించారు.- రామడుగు

కాశేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లింక్-2లో అద్వితీయ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, లిఫ్టు అడ్వయిజర్ పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిదో ప్యాకేజీ రామడుగు మండలం గాయత్రి పంప్‌హౌస్‌లో రెండు బాహుబలి మోటర్ల వెట్ ట్రయల్న్ విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం వరకు సర్జ్‌పూల్‌లో 222 మీటర్ల ఎత్తుతో నీటిని నింపిన అధికారులు, ఆదివారం వెట్ ట్రయల్న్ విజయవంతమైన ఐదో మోటర్‌కు మరోసారి రెండోసారి పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు లిఫ్ట్ అడ్వయిర్ పెంటారెడ్డి స్విచ్ఛాన్ చేసి ప్రారంభించగా, 2.15 గంటల వరకు విజయవంతంగా నడిపారు. మధ్యాహ్నం విడుదల చేసిన నీరు గ్రావిటీ కెనాల్ నుంచి సుమారు 5.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న (శ్రీరాములపల్లి సమీపంలోని) వరద కాలువ జంక్షన్ పాయింట్‌కు చేరుకునేంతలోపే ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్ అక్కడకు చేరుకొని, నీటి ప్రవాహ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో బంధించి, హర్షం వ్యక్తం చేశారు.

రాత్రి 9.17గంటలకు నాలుగో మోటర్..
మధ్యాహ్నం 45నిమిషాల పాటు ఐదో మోటర్ నడిపిన అధికారులు, నాలుగో మోటర్ వెట్ ట్రయల్న్‌క్రు ఏర్పాట్లు చేశారు. రాత్రి 9.17 గంటలకు లిఫ్ట్ అడ్వయిజర్ పెంటారెడ్డి మోటర్‌ను ప్రారంభించగా, 11.27 గంటల దాకా విజయవంతంగా నడిపించారు. సర్జ్‌పూల్‌లో అనుకున్నస్థాయిలో నీరు ఉండగా, పంపింగ్ ఫ్లోర్‌లోని కంట్రోల్‌రూమ్‌లో లిఫ్టు అడ్వయిజర్, ఈఎన్‌సీ సాంకేతిక పరీక్షలు నిర్వహించి నాలుగో పంపును ప్రారంభించారు. ఈ ప్రక్రియనంతా హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచి సీసీ కెమెరాల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ వీక్షించారు. ఈఎన్‌సీ, లిఫ్ట్ అడ్వయిజర్‌కు అభినందనలు తెలిపారు. నాలుగో మోటర్ నుంచి వచ్చే జలాలను మిడ్‌మానేరుకు తరలించాలని సీఎం ఆదేశించినట్లు ఈఎన్‌సీ చెప్పారు. దీంతో నాలుగో మోటర్ ద్వారా వచ్చిన జలాలను నాలుగు గంటల్లోపే మిడ్‌మానేరుకు తరలించామనీ వెల్లడించారు. బాహుబలి మోటర్ల ట్రయల్న్ విజయవంతం కావడంతో ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, డీఈ గోపాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఈఎన్సీని ఎత్తుకొని విజయ సంకేతాన్నిచ్చారు. ఎనిమిదో ప్యాకేజీ డీఈ గోపాలకృష్ణ, ఏఈఈలు శ్రీనివాస్, సురేశ్, రమేశ్ నాయక్, వెంకటేశ్ నాయక్, ప్రసాద్, ఏజెన్సీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

సందర్శకుల సంబురం..
గాయత్రి పంపుహౌస్‌లో వెట్ ట్రయల్ రన్ చేపడుతున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లావాసులు దూరప్రాంతాల నుంచి తరలివచ్చారు. మధ్యాహ్నానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. డెలివరీ సిస్టర్న్ నుంచి ఎగిసిపడుతున్న జలాలను చూసి సంబురపడ్డారు. పరవళ్లను సెల్‌ఫోన్లలో బంధించారు. సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు.84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles