వైద్యరంగంలో రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలుపుతాం

Sun,August 11, 2019 02:38 AM

-ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేయాలి
- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
- ఫిజీషియన్ అసోసియేషన్ నాలుగో రాష్ట్రస్థాయి సదస్సు ప్రారంభం
కరీంనగర్ హెల్త్ : వైద్య రంగంలో తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‌లో అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగో రాష్ట్రస్థాయి ఫిజీషియన్ వైద్యుల సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వైద్యంలో ప్రతి దాంట్లో ఫిజీషియన్‌దే ముఖ్య పాత్ర అని అన్నారు. గతంలో అన్నింటికీ ఒక ఎంబీబీఎస్ వైద్యుడే చికిత్స అందించేవారనీ, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వైద్యం రావడంతో ప్రత్యేక వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఏ వ్యాధికైనా ముందుగా ఫిజీషియనే రోగాన్ని గుర్తించి స్పెషలిస్టుల వద్దకు రెఫర్ చేస్తారన్నారు. కొంతమంది ప్రజలు తెలియక స్పెషలిస్టుల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారనీ, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. వైద్యో నారాయణ హరి అనే నానుడిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వైద్యులపై కొంతమంది దాడులు చేస్తున్నారంటే ఇది ఎందుకు జరుగుతుందో ఆలోచించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.

ఇప్పటికే ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య 65 శాతం పెరిగిందనీ, ఇంకా ఇందులో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరగడం శుభ పరిణామమని చెప్పారు. వైద్య రంగానికే తెలంగాణ ఆదర్శంగా కానుందనీ, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. ఎంపీ బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారనీ, కానీ కొంతమంది వైద్యేతరులు వైద్యాన్ని వృత్తి వ్యాపారంగా మార్చడంతోనే వైద్యులపై నమ్మకం పోతున్నదన్నారు. అలాంటి వ్యక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దని సూచించారు. పవిత్రమైన వైద్య వృత్తిని ప్రతి వైద్యుడు కాపాడుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి వైద్యుడూ పని చేయాలన్నారు. కరీంనగర్ వైద్య రంగానికి పేరుందనీ, చుట్టుపక్కల పది జిల్లాలకు పైగా ప్రజలు ఇక్కడికే వస్తారనీ, ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ వైద్యులు పవిత్రమైన వృత్తిగా భావించి మానవతా దృక్పథంతో పని చేయాలన్నారు. శస్త్ర చికిత్సలు చేయాలంటే ఫిజీషియన్ వైద్యుడు తప్పకుండా అవసరమనీ, ప్రతి రోగంలో ఫిజీషియన్‌దే ముఖ్య పాత్ర ఉంటుందని చెప్పారు. ఎంబీబీఎస్ సీట్ రాకుంటే ఐఏఎస్ అయిన వారు చాలా మంది ఉన్నారనీ, ఐఏఎస్ కన్నా ఎంబీబీఎస్ కఠినంగా ఉంటుందన్నారు.

మారుమూల ప్రాంతాల్లో కూడా ఉచిత వైద్య శిబిరాలు పెట్టి పేద ప్రజలకు వైద్య సేవలందించాలని కోరారు. దవాఖానాలు, వైద్యులపై దాడులు చేస్తే జీవో 15 ఉందనీ, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో నాన్ బెయిలబుల్ కేసుతో పాటు మూడేళ్ల జైలుశిక్ష ఉంటుందనీ, దవాఖానాలపై దాడులు చేస్తే మూడింతల నష్ట పరిహారాన్ని కూడా నిందితుల నుంచి వసూలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సావనీర్‌ను మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు విడుదల చేశారు. ఫిజీషియన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పాలికర్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డీసీ తిరుపతిరావు, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బీఎన్‌రావు, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పొలాడి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ రఘురామన్, సైంటిఫిక్ చైర్మన్ డాక్టర్ గండయ్య, ఎంవీ రావు, శాంతరావు, రాజారావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ విజయమోహన్‌రెడ్డి, కో ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ జే సురేశ్, వెంకట్‌రెడ్డి, శేష శైలజ, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

తెలివాహ కవితా సంకలనం ఆవిష్కరణ
సమకాలిన సామాజిక సమస్యలపై అభ్యుదయ కవి డాక్టర్ దామెర రాములు రచించిన తెలివాహ కవితా సంకలనాన్ని రాష్ట్ర స్థాయి ఫిజీషియన్ సదస్సులో మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. దామెర రాములు వృత్తి రీత్యా నిర్మల్‌లో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు డాక్టర్లు అభినందించారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles