దైవ దర్శనానికి వెళ్తూ.. మృత్యు ఒడికి..

Sat,August 10, 2019 02:46 AM

-ప్రకాశం జిల్లా మోచర్లలో ఆరుగురు జిల్లా వాసుల దుర్మరణం
-తిరుపతికి కూతురి కుటుంబంతోకలిసి వెళ్లిన తల్లిదండ్రులు
- రైలు ప్రయాణం రద్దు చేసుకొని కారులో ప్రయాణం
- ఘటనా స్థలంలో ఐదుగురు.. దవాఖానకు తీసుకెళ్తుండగా మరొకరు మృతి

కరీంనగర్ క్రైం : శ్రావణ మాసం..వరుస సెలవులు రావడంతో దైవ దర్శనం చేసుకునేందుకు వెళ్లిన రెండు కుటుంబాలు అనుహ్యరీతిలో బలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు జిల్లావాసుల ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటనలో తల్లిదండ్రులు, కూతురు, అల్లుడు, వారి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, జిల్లాకేంద్రంలో విషాదం నెలకొన్నది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌కు చెందిన కొంపెల్లి మలహల్‌రావు న్యాయశాఖలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి, ఉద్యోగ విరమణ పొందాడు. తిరిగి ఏడేళ్ల పాటు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేశాడు. గత మేలో విరమణ పొందాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం నుంచి వరుస సెలవులు ఉండడంతో కూతురు కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్దామని అనుకున్నాడు. శుక్రవారం రైలులో వెళ్లేందుకు టికెట్లు కూడా రిజర్వేషన్ చేయించాడు.

చివరి నిమిషంలో రైలు ప్రయాణం రద్దు..
మలహల్‌రావు కూతురు అర్చనకు మంకమ్మతోటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వంగపల్లి వంశీకృష్ణతో వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు అద్వైత్, కృశాంత్. వీరంతా హైదరాబాద్‌లో ఉంటున్నారు. మలహల్‌రావు, ఆయన భార్య లీలావతి హైదరాబాద్‌లో ఉంటున్న కూతురు, అల్లుడు వద్దకు గురువారం సాయంత్రం వెళ్లారు. అక్కడి నుంచి కూతురు కుటుంబంతో కలిసి తిరుపతి రైలులో వెళ్లాలని అనుకున్నారు. కానీ, అంతలోనే రైలు ప్రయాణాన్ని రద్దు చేసుకొని, కారులో వెళ్దామని అనుకున్నారు.

కారు ప్రయాణమే ప్రాణాలు తీసింది..
అనుకున్నట్లుగానే శుక్రవారం ఉదయం 5గంటల ప్రాంతంలో వారంతా కారులో బయలుదేరారు. వంశీకృష్ణ, తన భార్యను పక్క సీట్లో కూర్చోబెట్టుకొని కారు నడుపుతుండగా, మలహల్‌రావు, అతని భార్య, ఇద్దరు పిల్లలు వెనకాల కూర్చున్నారు. వీరంతా తొమ్మిది గంటల ప్రాంతంలో విజయవాడకు చేరుకున్నారు. కనకదుర్గ ఆలయంలో దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడే టిఫిన్ చేసి, తిరుపతికి బయలుదేరారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల జాతీయ రహదారిపై వీరి కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన మలహల్‌రావు, ఆయన భార్య లీలావతి, కూతురు అర్చన, అల్లుడు వంశీకృష్ణతోపాటు అద్వైత్ అక్కడికక్కడే చనిపోగా, కృశాంత్‌ను దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారనీ, శనివారం సాయంత్రానికి మృతదేహాలు నగరానికి వచ్చే అవకాశమున్నట్లు బంధువులు తెలిపారు.

మూడేళ్ల క్రితం తండ్రి.. నేడు కొడుకు..
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటకు చెందిన వంశీకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతడి తండ్రి మూడేళ్ల క్రితమే చనిపోయాడు. అత్తామామ, తన కుటుంబంతో కలిసి సంతోషంగా తిరుపతికి కారులో బయలు దేరిన వంశీకృష్ణ ఇప్పుడు అనుహ్య రీతిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొడుకుతోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఉంటున్న కూతురు వద్దకు వెళ్లిన తల్లికి ఈ విషయం తెలియదు. మలహల్‌రావు కొడుకు అనుదీప్ హైదరాబాద్‌లో సాఫ్ట్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ప్రమాద వార్త తెలియడంతో ఆయన స్పృహకోల్పోయాడని బంధువులు తెలిపారు. రైలులో వెళ్తే అందరూ బతికేవాళ్లనీ, కారులో వెళ్లడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని చెబుతూ కంటతడి పెట్టారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles