స్పందన సీజ్‌కు ఆదేశాలు

Fri,August 9, 2019 02:01 AM

జమ్మికుంట: మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాథాశ్రమంలో నిబంధనలు పాటించడం లేదంటూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం డీసీపీవో పర్వీన్ ఆధ్వర్యంలో అధికారులు సీజ్ చేసేందుకు వెళ్లగా, నిర్వాహకులు, విద్యార్థులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లిలో వీరస్వామి దంపతులు గత 11 ఏళ్లుగా స్పందన స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 26 మంది అనాథ పిల్లలున్నారు. ఇందులో చదువుకునే విద్యార్థులున్నారు. అయితే పలుమార్లు ఈ ఆశ్రమాన్ని జిల్లా బాలల సంరక్షణ అధికారి పర్వీన్ సందర్శించారు. నిబంధనలు పాటించడం లేదని చెప్పారు. నిబంధనలు పాటించని అంశాలకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. రాష్ట్ర డైరెక్టరేట్ నుంచి సదరు స్పందన స్వచ్ఛంద సంస్థను సీజ్ చేయాలని ఆదేశాలు వచ్చాయి.

ఇదే విషయాలను కూడా నిర్వాహకులకు అధికారి తెలిపింది. అయితే ఈనెల 7న సదరు సీజ్ పత్రాలను కలెక్టర్‌కు సమర్పించింది. సంస్థ మూసి వేయాలని కలెక్టర్ సూచించారు. దీంతో డీసీపీవో పర్వీన్, సీడీపీవో శారద, తాసిల్దార్ డాక్టర్ కే నారాయణ, పట్టణ సీఐ కే సృజన్‌రెడ్డి, తదితర అధికారులు వెళ్లి సీజ్ చేసేందుకు యత్నించారు. సదరు చర్యలను నిర్వాహకులు, పిల్లలు అడ్డుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. సంఘటన స్థలానికి జడ్పీటీసీ శ్రీరాం శ్యాం వచ్చారు. ప్రభుత్వ నిబంధనలు, సంస్థలో పాటించని నిబంధనలు వివరించారు. విద్యార్థులను, అనాథ పిల్లలను జిల్లా బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్తామని తెలిపారు. సహకరించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటించడానికి గడువు ఇవ్వాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌తో జడ్పీటీసీ శ్యాం మాట్లాడగా.. రెండు రోజుల గడువు ఇచ్చారు. దీంతో అధికారులు వెళ్లిపోయారు. ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగింది.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles