815 మందిపై అనర్హత వేటు

Thu,July 18, 2019 04:13 AM

- ఉమ్మడి జిల్లా నేతలపై ఈసీ కొరడా

(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) అన్ని నగరపాలక, పురపాలక సంస్థలో ఎన్నికల సందడి నెలకొన్న వేళ 2014 ఎన్నికల్లో పోటీలో నిలబడి ఎన్నికల సంఘానికి లెక్కలు అప్పగించిన అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. ఈ విషయంలో గతేడాదే ఓ జాబితా ప్రకటించింది. కాగా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తుండడంతో మరోసారి జాబితా విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం రెండు నగరపాలక సంస్థలతో పాటు కొత్తగా ఏర్పడ్డ వాటితో కలిపి మొత్తం 14 మున్సిపాలిటీలు ఉన్నాయి. గత ఎన్నికల్లో లెక్కలు చూపని ఉమ్మడి జిల్లాకు చెందిన 815 మందిని అనర్హులుగా తేల్చారు. ఇందులో అత్యధికంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో 363 మంది ఉండగా, అత్యల్పంగా హుజూరాబాద్‌లో ఒకరు ఉన్నారు. ఆయా జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 132 మంది, జమ్మికుంటలో 34 మంది, హుజూరాబాద్‌లో ఒకరు చొప్పున మొత్తం 167 మంది ఉన్నారు. జగిత్యాలలో 81 మంది, కోరుట్లలో 93 మంది చొప్పున మొత్తం 174 మంది ఉన్నారు. పెద్దపల్లిలో 36 మంది, రామగుండంలో 363 మంది చొప్పున మొత్తం 399 మంది ఉన్నారు.

సిరిసిల్లలో 16 మంది, వేములవాడలో 59 మంది చొప్పున మొత్తం 75 మంది ఉన్నట్లు ప్రకటించారు. వీళ్లు గత ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా పోటీచేసి ఓడిపోయినా ఎన్నికల ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి అందించలేకపోయారు. ఈ విషయంలో గత ఏడాదిలో చివరి సారిగా లెక్కలు అప్పగించేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. అయినా కొందరు అభ్యర్థులు తమ లెక్కలను అప్పగించకపోవడంతో కొదరిని ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు, మరికొందరిని 2020 జూన్ 22వ తేదీ వరకు వారు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయా నాయకులు ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు సైతం ఈ జాబితాలో ఉండడం కొసమెరుపు. మొత్తానికి ఈ అనర్హత జాబితా ప్రస్తుతం మున్సిపాలిటీల్లో చర్చనీయంశంగా మారింది.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles