ఓటరు జాబితాలో మార్పులు

Thu,July 18, 2019 04:12 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ నగరపాలక సంస్థలో డివిజన్ల వారీగా ఇచ్చిన ఓటరు జాబితాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు నగరపాలక అధికారులు బుధవారం డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్ల జాబితా ప్రకటించారు. దీంతో ఆయా డివిజన్లలో పెద్ద సంఖ్యలో ఓటర్ల మార్పులు రావడంతో రిజర్వేషన్లపై ఆశావహుల అంచనాలు కూడా తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ముసాయిదా జాబితాలో ఓ డివిజన్‌లో చూపించిన ఎస్టీలను తుది జాబితా మరో డివిజన్లలో చేర్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముసాయిదాలో 3వ డివిజన్‌లో 398 మంది ఎస్టీ ఓటర్లను చూపించగా.. తుది జాబితా వచ్చే సరికి ఈ డివిజన్‌లో 123, పక్కన ఉన్న 2వ డివిజన్‌లో ముసాయిదాలో 51 ఎస్టీ ఓటర్లు ఉండగా.. తుది జాబితా వచ్చేసరికి 326కు చేరడం విశేషం. అలాగే 39వ డివిజన్‌లో ముసాయిదాలో ఎస్టీ ఓటర్లు 254 మంది ఉంటే.. తుది జాబితాలో 88కి చేరింది. అలాగే 38వ డివిజన్‌లో ముసాయిదాలో 154 మంది ఎస్సీలు ఉండగా.. తుది జాబితా వచ్చే సరికి 75కు వచ్చింది. దీంతో ఆయా డివిజన్ల రిజర్వేషన్లపై ఆశావహుల అంచనాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీసీలు 59 శాతం
నగరపాలక సంస్థలో తుది జాబితా లెక్క ప్రకారం 59 శాతం బీసీ ఓటర్లు ఉన్నారు. నగరంలో మొత్తంగా 2.56,312 ఓటర్లు ఉండగా వీరిలో 1,28,922 మంది పురుషులు, 1,27,390 మహిళలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 59 శాతంతో 1,51,985 బీసీ ఓటర్లు ఉండగా, వీరిలో 76,409 మంది మహిళలు, 75,576 పురుషులు ఉన్నారు. అలాగే నగరంలో 2610 మంది ఎస్టీ ఓటర్లు ఉండగా.. వీరిలో 1306 మంది పురుషులు, 1304 మంది మహిళలు ఉన్నారు. 23,542 మంది ఎస్సీ ఓటర్లు ఉండగా వీరిలో 12,109 మంది మహిళలు, 11,433 పురుషులు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం నగరంలో 9.18 శాతం ఎస్సీ ఓటర్లు ఉన్నారు.

ఓటర్ల జాబితాపై ఆందోళన
నగరపాలక అధికారులు ప్రకటించిన తుది ఓటర్ల జాబితాపై వివిధ పార్టీల నాయకులు, పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ డివిజన్లలో ఓటర్లను అడ్డగోలుగా మార్చారంటూ మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి, నాయకుడు అర్ష మల్లేశం ఆధ్వర్యంలో ఎస్టీలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కొందరి కోసం డివిజన్లలో ఓటర్లను మార్చారంటూ విమర్శించారు. ఇదే విషయంపై నగర కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు.

రిజర్వేషన్లపై టెన్షన్
కాగా, ఇటీవల నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితాను అనుసరించి పలానా డివిజన్లు పలానా రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉందని ఆశావహులు అంచనా వేయగా, తుది జాబితాతో వారి లెక్కలు తప్పాయి. ఏయే డివిజన్ ఎవరికి రిజర్వ్ అవుతుందన్న లెక్కల్లో నేతలు, నాయకులు మునిగిపోయారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏ మేరకు రిజర్వేషన్ శాతం కేటాయిస్తుందన్న విషయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారుగా నేతలు డివిజన్ల వారీగా ఓటర్ల లిస్టును చూస్తూ రిజర్వేషన్లపై అంచనాలను సిద్ధం చేస్తున్నారు. కాగా, అధికారులు ఇచ్చిన తుది జాబితాను అనుసరించి ఇప్పటికే రిజర్వేషన్లపై లెక్కలు వేసి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే రిజర్వేషన్లు తేలనున్నాయి. ఎస్టీలకు రెండు స్థానాలు రిజర్వు అయితే 2వ డివిజన్ (326), 51వ డివిజన్ (174) అయ్యే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అలాగే ఎస్సీలకు సంబంధించి 57వ డివిజన్ (2080 మంది ఓటర్లు), 4వ డివిజన్ (1808), 9వ డివిజన్ (1289), 10వ డివిజన్ (1200), 50వ డివిజన్ (1123), 12వ డివిజన్ (1001), 11వ డివిజన్ (994), 58వ డివిజన్ (892), 19వ డివిజన్ (852)లో ఎస్సీ ఓటర్లు ఉన్నారు. బీసీ ఓటర్లకు సంబంధించి 40వ డివిజన్(4310), 41వ డివిజన్(4146, 27వ డివిజన్(4123), 60వ డివిజన్(3596), 18వ డివిజన్(3591, 32వ డివిజన్(3451), 7వ డివిజన్(3296), 17వ డివిజన్(3268), 8వ డివిజన్(3267), 23వ డివిజన్(3233), 29వ డివిజన్(3220), 21వ డివిజన్(3199, 26వ డివిజన్(3197), 16వ డివిజన్(3197), 28వ డివిజన్(3138), 20వ డివిజన్(3118, 42వ డివిజన్(3101), 15వ డివిజన్(3903)లలో అధికంగా ఉన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles