మహిళలకు సఖీ కేంద్రం అండ

Fri,July 5, 2019 03:17 AM

టవర్‌సర్కిల్: జిల్లాలో బాలికలు, స్త్రీలపై జరిగే హింసను అడ్డుకునేందుకు సఖీ కేంద్రం (వన్ స్టాఫ్ సెంటర్) ఎప్పుడూ అండగా ఉంటుందని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని కార్యాలయంలో జరిగిన సఖీ కేంద్రం మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. జిల్లాలోని బాలికలు, స్త్రీలపై జరిగే లైంగికదాడులు, హింసకు సంబంధించిన వైద్య సేవలు, కౌన్సెలింగ్ సేవలు, పోలీస్, న్యాయ సహాయం, తాత్కలిక వసతులను సఖీ కేంద్రం ద్వారా బాధిత మహిళలకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. సఖీ కేంద్రం పక్కాభవన నిర్మాణానికి త్వరలో శంఖుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. సఖీ సెంటర్ ద్వారా జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు పంపిన బాధిత మహిళలకు తక్షణ వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. పలు కేసుల్లో బాధిత ఇరు కుటుంబ సభ్యులకు సఖీ కేంద్రం కౌన్సిలింగ్ సందర్భంగా ఎలాంటి గొడవలు కాకుండా నిరోధించేందుకు హోంగార్డును కేటాయించాలని పోలీస్ అధికారులకు సూచించారు. సఖీ సెంటర్‌కు ఇంతవరకు 475 గృహహింస కేసులు, 3 అత్యాచార కేసులు, 5 లైంగిక వేధింపుల కేసులు, 11 బాల్య వివాహాల కేసులు, 2 కిడ్నాప్ కేసులు, 57 సైబర్ క్రైం, చీటింగ్ కేసులు, ఒక వరకట్న వేధింపుల కేసు, 76 ఇతర కేసులు వచ్చినట్లు ఆయన వివరించారు. లైంగిక దాడికి గురైన బాధిత మహిళల పిల్లలను కేజీబీవీ, మోడల్ స్కూల్, ఇతర వసతి గృహాల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. బాధిత మహిళలకు స్వయం ఉపాధి కల్పనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణల మంజూరు ప్రతిపాదనలను సంబంధిత కార్పొరేషన్లకు పంపించాలని ఆదేశించారు. డీఆర్డీఏ, మెప్మా ద్వారా బాధిత మహిళలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శారద, ఏసీపీ రాగ్యా నాయక్, మెప్మా పీడీ పవన్‌కుమార్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి బాల సురేందర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డెమో దుర్గారావు, సఖీ కేంద్రం కోఆర్డినేటర్ లక్ష్మీ, లీగల్ కౌన్సిలర్ సమతారెడ్డి, సోషల్ కౌన్సెలర్ రేణుక, కేసు వర్కర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles