సమన్వయంతో పని చేయాలి

Thu,June 20, 2019 01:49 AM

- అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
- అధికారులకు మంత్రి ఈటల ఆదేశం
- హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై సమీక్ష
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మిషన్ భగీరథ, భూ రికార్డుల శుద్ధీకరణ, మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు, హరితహారం కార్యక్రమం నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలనీ, భూ రికార్డుల శుద్ధీకరణను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రైతులను తాసిల్ కార్యాలయానికి తిప్పుకోకుండా అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలనీ, రైతుబంధును వారి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. జూలై 10లోగా భూ ప్రక్షాళన పూర్తి చేసి గ్రామాల వారీగా వివరాలను బుక్‌లెట్ ద్వారా తనకు అందజేయాలని తాసిల్దార్లను ఆదేశించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించడానికి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

నిర్మాణం పూర్తయిన చెక్ డ్యాంలకు బుంగలు పడ్డాయనీ, వాటికి మరమ్మతులు చేయాలనీ, కొత్త చెక్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మిషన్ కాకతీయ చెరువుల పనులు పూర్తి చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు వంతెన పనులు, కొత్తగా వేసే బీటీ రోడ్డు పనులు, సీసీ రోడ్డు పనులు, పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి అర్హత కలిగి దరఖాస్తు చేసుకున్న వారందరికీ చెక్కులు అందజేయాలని సూచించారు. ఈ ఏడాది చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి అనువైన స్థలాలను ఎంపిక చేసి మొక్కలు నాటి సంరక్షించాలనీ, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలీటీలకు ఇప్పటికే అందజేసిన రూ.70 కోట్ల నిధులతో చేపట్టిన పనుల వివరాలు అందించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పార్కులు, స్మశాన వాటికలు, సెంట్రల్ లైటింగ్, డ్రైన్లు, రోడ్లు, కూరగాయలు, మటన్, వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయుల రేషనైలేజషన్ చేపట్టాలనీ, అన్ని పాఠశాలల్లో ఫర్నీచర్ ఉండేలా చూడాలనీ, పాత ఫర్నీచర్ ఉంటే లేని పాఠశాలలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పాఠశాలలు కట్టిన తేదీలు, పాఠశాలలకు ఉన్న స్థలం, ప్రహారీ ఉందా లేదా తదితర వివరాలన్ని సమర్పించాలన్నారు. వ్యవసాయ రుణాలు అందేలా చూడాలనీ, విత్తనాలను సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయాధికారికి సూచించారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపునకు గురి కాకుండా చూడాలని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారిని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్యసేవలు అందేలా చూడాలని, వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. వర్షాకాలం రానున్నందున అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలనీ, సానిటేషన్ చేయించాలనీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. స్థానిక సంస్థలకు కొత్త పాలక వర్గం వచ్చినందున అన్ని శాఖల అధికారులు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లతో సమావేశాలు నిర్వహించి సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌లాల్, ప్రత్యేకాధికారి ప్రావీణ్య, వివిధ శాఖల అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles