ల్యాబ్‌ ఉండాల్సింది ఇలాగేనా?

Wed,June 19, 2019 02:03 AM

- ఏసీలు లేకుంటే రిపోర్టులు ఎలా వస్తాయి..
- కిటికీలు తెరిచి ఉంచితే తేడాలు రావా?
- హుజూరాబాద్‌ దవాఖాన సిబ్బందిపై వైద్య విధాన పరిషత్‌ జాయింట్‌ కమిషనర్‌ అశోక్‌కుమార్‌ ఆగ్రహం
- రాష్ట్ర టీబీ కంట్రోల్‌ అధికారి డాక్టర్‌ రాజేశంతో కలిసి ఆకస్మిక తనిఖీ
- రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచన
- సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
హుజూరాబాద్‌టౌన్‌ఃహుజూరాబాద్‌ ప్రభుత్వ దవాఖానను వైద్య విధాన పరిషత్‌ జాయింట్‌ కమిషనర్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌, రాష్ట్ర టీబీ కంట్రోల్‌ అధికారి డాక్టర్‌ రాజేశంలు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సీమాంక్‌కు వెళ్లి చూడగా బాలింతలకు అందుతున్న వైద్య సేవలు, పౌష్టికాహారం, కేసీఆర్‌కిట్‌ అందజేతపై వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులను పరిశీలించి, గర్భిణీల వెంట ఆశ, ఏఎన్‌ఎంలు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులకో సారి గర్భిణీలను పరీక్షించి అవసరమైన మందులు ఇచ్చి, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు తెలుపాలన్నారు. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని నాణ్యమైన వైద్యం అందించాలని సూపరింటిండెంట్‌ను ఆదేశించారు. అలాగే ల్యాబ్‌కు వెళ్లి చూడగా అత్యంత ఖరీదైన వైద్య పరికరాలు ఉండగా వాటికి అవసరమైన ఏసీలు లేకపోగా, కిటికీలు తెరచి పెట్టడంపై అక్కడి ఉద్యోగులను మందలించారు. అసలే వాతావరణం వేడిగా ఉండి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండగా కిటికీలు తెరచి పెట్టడంతో టెంపరేచర్‌ పెరిగి ల్యాబ్‌కు సంబంధించిన రిపోర్టు సరిగా రావని తెలియదా, రిపోర్టులు తారుమారు అయి ప్రాణాల మీదకు వస్తుంది తెలుసా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ల్యాబ్‌లో అన్ని రకాల పరీక్షలు చేయాలని, థైరాయిడ్‌ ఇతర రకాల పరీక్షల అత్యవసర పరీక్షల కోసం ప్రైవేట్‌కు పంపించడం బాగానే ఉన్నా వాటి ఖర్చులు పేదవారికి దవాఖాన నుండే చెల్లించాలని తెలుసా అని చెప్పారు.

ల్యాబ్‌లో ఖచ్చితమైన రిపోర్టులు రావాలంటే తక్షణమే ల్యాబ్‌లో రెండు ఏసీ మిషన్లు పెట్టించాలని సూపింటిండెంట్‌ను వారు ఆదేశించారు. గర్భిణీలకు అవసరమైన ఉచిత రవాణ సౌకర్యాలు వైద్య సిబ్బంది(ఆశలు,ఏఎన్‌ఎంలు) కల్పించాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని, సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. డెలివరీ కోసం 24గంటల పాటు గైనకాలజిస్టులు అందుబాటులో ఉండాలన్నారు. ఈ నెలాఖరులోగా దవాఖానను వైద్య విధాన పరిషత్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందని, దానికి అనుగుణంగా సంబంధిత ఉద్యోగుల నియమాకాలు, ఇతర వసతి సదుపాయాలు కల్పించడంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని త్వరలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్షించనున్నట్లు వారు తెలిపారు. వారితో పాటు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రామ్‌ మనోహర్‌రావు, దవాఖాన సూపరింటిండెంట్‌ ఎన్‌ రమణారావు, డాక్టర్‌ యాదగిరిరావు, డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ లీల, డాక్టర్‌ విజేత, డాక్టర్‌ రమేష్‌, డాక్టర్‌ వాణి తదితరులు ఉన్నారు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles