సర్కారు బడులకు పంపండి..

Tue,June 18, 2019 01:28 AM

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందనీ, పిల్లలను పంపించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జరిగిన ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధ్యర్యంలో నిర్వహించిన సాముహిక అక్షరభ్యాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లోనే ఎక్కువ విద్యార్హతలు గల ఉపాధ్యాయులున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఉచిత విద్యతోపాటు ఉచిత మధ్యాహ్న భోజనం, ఉచితంగా యూనిఫాం అందజేస్తారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి ప్ర భుత్వ పథకాలను సద్వినియోగం చేసుకున్నట్లే తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపాలని సూచించారు. మేయర్‌ రవీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు వ్యాపార ధోరణిని అవలంబించవని పేర్కొన్నారు. ఈ పాఠశాల్లో చదివిన వారు నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులు అత్యధికంగా పది జీపీఏలు సాధించారన్నారు. ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు కొత్త పలకలు, బలపాలు అందజేసి, అక్షరాలు దిద్దించారు. డీఎంహెచ్‌వో రాంమనోహర్‌రావు, విద్యాశాఖ ఏడీ అనురాధ, సెక్టోరల్‌ అధికారులు రాజభాను చంద్రప్రకాశ్‌, అనురాధ, ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పండువలా కార్యక్రమం..
కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా సోమవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులను ప్రభుత్వ బడులకు ఆహ్వానించి, ఈ కార్యక్రమాలను పండువలా నిర్వహించారు. బడిబాట ప్రాధాన్యత, చదువు విశిష్టతను తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించారు. నూతనంగా నమోదైన విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ స్కూళ్లలోని సౌకర్యాలను వివరిస్తూ ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలను నమోదు చేశారు. సోమవారం జిల్లాలోని వివిధ మండలాల్లో అంగన్‌వాడీల ద్వారా 105 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, డైరెక్ట్‌ అడ్మిషన్లు 26 మంది విద్యార్థులు, ప్రైవేట్‌ పాఠశాల్లో 158 మంది విద్యార్థులు, ప్రభుత్వ బడుల్లో 119 మంది విద్యార్థులు కొత్తగా నమోదు చేసుకున్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా మొత్తం 408 మంది విద్యార్థులు కొత్తగా నమోదయ్యారు.

102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles