సత్ఫలితాలిస్తున్న బడిబాట

Mon,June 17, 2019 01:25 AM

కరీంనగర్ ఎడ్యుకేషన్: సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పేరిట చేపట్టిన కార్యక్రమం జిల్లాలో మంచి ఫలితాలను ఇస్తున్నది. పాఠశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కాగా, శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు మన ఊరి బడి, 15న బాలికా విద్య, 17న సామూహిక అక్షరాభ్యాసం, 18న స్వచ్ఛ పాఠశాల హరితహారం, 19న పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం, బాల కార్మికుల విముక్తి వంటి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రతి పాఠశాలకు ప్రచార సామగ్రి, ఖర్చుల నిమిత్తం రూ. 1000 విడుదల చేశారు. ఈ మేరకు మొదటి రెండో రోజుల కార్యక్రమాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలు, గత విద్యా సంవత్సరం ఫలితాలు వివరిస్తూ పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు.

50 వేల ప్రవేశాలు లక్ష్యంగా..
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 424, ప్రాథమికోన్నత పాఠశాలలు 76, ఉన్నత పాఠశాలల 149 మొత్తం 649 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 38,208 మంది విద్యార్థులు చదువుకోగా.. ఈ సారి 50 వేల మందికి అడ్మిషన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నూతన ప్రవేశాలకు విద్యార్థులు భారీగా పేర్లు నమోదు చేసుకుంటున్నారు. శుక్రవారం జిల్లాలోని వివిధ మండలాల్లోని పాఠశాల్లో మొత్తం 1005 మంది, శనివారం 812 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles