‘కాళేశ్వరం’తో జిల్లా సస్యశ్యామలం

Sat,June 15, 2019 02:38 AM

-ఆగస్టు మొదటి వారంలో కరీంనగర్‌కు నీళ్లు..
-కబ్జాకు గురైన కాలువలు, చెరువులు, కుంటలను పునరుద్ధరించాలి..
-ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌
-ఆచంపల్లి కాలువ పురోగతిపై అధికారులతో సమీక్ష
కరీంనగర్‌ రూరల్‌: కాళేశ్వరం నీళ్లతో జిల్లాలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఆచంపల్లి వద్ద నిర్మిస్తున్న కాలువ నిర్మాణ పనుల పురోగతి, కాలువల పునరుద్ధరణపై కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్సారెస్పీ, ఇరిగేషన్‌, మిడ్‌ మానేరు అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోని బద్దిపల్లి, కమాన్‌పూర్‌, ఆసిఫ్‌నగర్‌, ఎలగందుల, నాగులమల్యాల ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు. కొత్తపల్లి, కరీంనగర్‌రూరల్‌ మండలంలోని తూములు, వరద కాలువ అధునికీకరణపై అధికారులతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు, సాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జూన్‌ 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించే అవకాశముందని వెల్లడించారు.

కాగా, సుమారు పాతికేళ్లుగా కొత్తపల్లి మండలంలోని ఐదు గ్రామాల రైతులు, ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వరద కాలువ కట్టడం వల్ల నీరు అక్కడే నిలిచిపోయి కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి నీరు రాకుండాపోయి రైతుల పంట సాగుకు ఇబ్బందిగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా నీరందిస్తే, మిడ్‌మానేరుకు వెళ్లే దారిలో వరద కాలువ ద్వారా ఆచంపల్లి వద్ద రెండు స్లూయిస్‌లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆ నీటి ద్వారా ఐదు గ్రామాలు బద్దిపల్లి, కమాన్‌పూర్‌, ఆసిఫ్‌నగర్‌, నాగుల మల్యాల, ఎలగందుల, గ్రామాలకు నీటి సమస్యలు ఉండవన్నారు. ఇన్నాళ్లూ ఈ గ్రామాలకు నీరు లేక ఇబ్బంది పడ్డారనీ, రానున్న రోజుల్లో కాళేశ్వరం నీటితో కరీంనగర్‌ మండలంలోని బీడు భూములన్నీ కళకళలాడుతాయని తెలిపారు. గత ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో నిర్మించిన వరద కాలువ వల్ల పై నుంచి వచ్చే వరద నీరు నిలిచి పోయిందనీ, కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల చెరువు మీద అధార పడి ఉన్న గొలుసు కట్టు చెరువులన్నీ ఎండిపోయి, వ్యవసాయ భూములు బీడులుగా మారి, పంట సాగుకు దూరమయ్యాయని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పాతికేళ్లుగా కొత్తపల్లి మండలంలోని రైతులు కరెంట్‌, సాగునీరు, తాగునీరుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారనీ, గ్రామాల్లో వ్యవసాయం కుంటుపడిందని పేర్కొన్నారు.

తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ అందించడంతోపాటు బీడు భూములను సాగులోకి తేవాలనే లక్ష్యంతో చెరువులు, కుంటలను నింపుతున్నదనీ, అందులో భాగంగానే ఆచంపల్లి వద్ద వరద కాలువకు రెండు తూములను నిర్మించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆచంపల్లి వద్ద నిర్మించిన తూముతో నాగుల మల్యాల చెరువును నింపడంతోపాటు దానిపై అధారపడి ఉన్న గొలుసు కట్టు చెరువులను నింపుతామని పేర్కొన్నారు. నాగుల మల్యాల చెరువు ద్వారా ఆసిఫ్‌నగర్‌, ఎలగందుల చెరువులతోపాటు మానేరు, మరో కాలువ ద్వారా కమాన్‌పూర్‌, బద్ధ్దిపల్లి చెరువులు నింపుతామన్నారు. కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలనీ, గ్రామాల్లో ఇంచు భూమి కూడా ఎండకుండా ఉండాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.

రానున్న రోజుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కబ్జాలకు గురైన కాలువలు, కుంటలను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. కుంటలు, చెరువులు నింపే ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా వెంటనే అధిగమించాలని తెలిపారు. అవసరమైతే కొత్త ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఆగస్టు మొదటి వారంలో కరీంనగర్‌కు కాళేశ్వరం నీటిని అందిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులను రాజును చేసే ప్రక్రియ ఒక యజ్ఞంలా కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ వాసాల రమేశ్‌, జడ్పీ మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్‌, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలతమహేశ్‌, మండల ఉపాధ్యక్షుడు ఉప్పు మల్లేశం, నాగుల మల్యాల, ఆసిఫ్‌నగర్‌, బద్దిపల్లి, ఎలగందల, కమాన్‌పూర్‌ గ్రామాల ప్రజాప్రతినిధులు దావ కమలమనోహర్‌, మంద రమేశ్‌, కొమ్ము రవికిరణ్‌, సర్పంచులు కడారి శ్రీనివాస్‌, జింక సంపత్‌, నాయిని ప్రసాద్‌, జడ్పీ కో ఆప్షన్‌ సాబీర్‌పాషా, ఆర్‌ మధు, ఎస్సారెస్పీ, మిడ్‌ మానేరు లెఫ్ట్‌ కెనాల్‌, మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles