స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు

Thu,June 13, 2019 01:33 AM

-బలోపేతానికి త్వరలోనే కొత్త చట్టాలు
-సర్పంచులకు చెక్‌పవర్
-ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్
-ప్రజాప్రతినిధులు తమ పదవులకు వన్నె తేవాలి
-గ్రామ ప్రథమపౌరులు, కార్యదర్శులు గ్రామాల్లోనే ఉండాలి
-పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాం
-జిల్లా అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తా
-జడ్పీ సర్వసభ్య సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- అన్ని జిల్లాల కంటే ఎక్కువ నిధులు తెచ్చాం: మంత్రి ఈటల రాజేందర్
-వచ్చే నెల 3న చివరి సమావేశానికి ఆమోదం
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కొత్త చట్టాలు తేబోతున్నామని వెల్లడించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ, పంచాయతీరాజ్ వ్యవస్థ పరిధిలోని విద్యా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. వీటిని బలోపేతం చేసేందుకు జడ్పీలు, పంచాయతీలకు సర్వాధికారాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామని ముఖ్యంగా పాఠశాలలపై ప్రజాప్రతినిధులకు అధికారాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులున్నా, మధ్యాహ్న భోజనం పెడుతున్నా పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారంటే ఎక్కడ లోపం ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందన్నారు.

ఉపాధిహామీ పథకంలో అధికారులే సమన్వయం చేసుకుంటున్నారనీ, ఈ పథకంపై ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం అవగాహన లేకుండా పోతున్నదన్నారు. ఇక నుంచి ఉపాధి హామీలో ప్రజా ప్రతినిధులకు తెలియకుండా ఒక్క పైసా ఖర్చు చేసేందుకు వీలులేకుండా చట్టం తీసుకువస్తున్నామని చెప్పారు. సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, అయితే వీరికి మరిన్ని అధికారాలు ఇచ్చి చెక్‌పవర్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగు నీటి సమస్యల పట్ల పట్టింపు లేకుండా పోతున్నదనీ, ఇక నుంచి సర్పంచులు పట్టించుకోకుంటే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. సర్పంచులు, కార్యదర్శులు ఎక్కడో ఉండి గ్రామాల్లో విధులు నిర్వహించే పరిస్థితి ఇక ముందు ఉండదనీ, వీరు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ పదవులకు వన్నెతెచ్చేలా వ్యవహరించాలనీ, ముందు తరాల వాళ్లు గొప్పగా చెప్పుకునే విధంగా పదవులకు గౌరవం పెంచాలని కోరారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో చర్చకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలాంటి పథకాలు అనేకం దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా కృష్ణా, గోదావరి నీళ్లను ప్రజల ముంగిలికి తెస్తున్నామని పేర్కొన్నారు. మిషన్ భగీరథలో భాగంగా తవ్విన సీసీ రోడ్లను పునరుద్ధరించేందుకు సర్పంచులకు సర్వాధికారాలు ఇస్తున్నామనీ, సీసీ రోడ్లకు నష్టం ఎక్కడ జరిగిందో చూసి సర్పంచులే నిర్ణయం తీసుకుని మరమ్మతులు చేసేలా నిధులు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామనీ, ఎక్కడెక్కడ బిల్లులు రావాల్సి ఉందో అధికారుల దృష్టికి తేవాలని జడ్పీటీసీ సభ్యులకు సూచించారు. హరితహారం పథకంలో రైతులు నాటిన మొక్కలు చాలా వరకు బతికాయనీ, కానీ, అధికారులు నాటిన మొక్కల్లో ఈ ప్రగతి లేదన్నారు. మొక్కలు నాటేందుకు, నీళ్లు పోసేందుకు కూడా నిధులు ఇస్తున్నామనీ, అయినా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాల్సిన అవసరముందన్నారు. వచ్చే సీజన్‌లో ప్రతి ఇంటికీ కనీసం ఆరు మొక్కలు నాటేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు.

ఆసరా పింఛన్లు వచ్చే నెలలో పెంచి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రి ఎర్రబెల్లి.. అన్ని చోట్ల ప్రజా ప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. రెవెన్యూ శాఖలో కొంత మంది అధికారుల కారణంగా అవినీతి పెరిగిపోయిందనీ, ఈ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా సీఎం కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైన జిల్లా అనీ, ఈ జిల్లా అభివృద్ధికి తాను సంపూర్ణంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. సమవేశం ప్రారంభానికి ముందు మంత్రులు ఎర్రబెల్లి, ఈటల జడ్పీ క్వార్టర్స్ ఆవరణలో 2 కోట్లతో నిర్మించిన నాలుగు జిల్లాల పంచాయతీ రాజ్ శిక్షణా కేంద్రాన్ని, జడ్పీ కార్యాలయ ఆవరణలో 5 కోట్లతో నిర్మించిన జడ్పీ నూతన భవనాన్ని ప్రారంభించారు.

భవిష్యత్‌లో మరింత అభివృద్ధి: మంత్రి ఈటల
రాబోయే రోజుల్లో స్థానికసంస్థల ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలోనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించబోతున్నదని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉంటేనే విలువ అని అనుకోవద్దనీ, రాజకీయ నాయకులుగా ఉండి కూడా ప్రజాసేవ చేయవచ్చని తెలిపారు. ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నవారే మెజార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలుపొందారని గుర్తు చేశారు. నిధులు ఎవరివి అనేది ముఖ్యం కాదనీ, అన్ని నిధులూ ప్రజలవేననీ, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం వివిధ రూపాల్లో ఖర్చు చేస్తుంటామని వివరించారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు రానన్ని నిధులు తెచ్చుకున్నామనీ, ప్రతిపైసా సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 800 నుంచి వెయ్యి కోట్ల వరకు నిధులు మంజూరు చేసుకున్నామని చెప్పారు. వచ్చే నెల 3న జడ్పీ చివరి సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరగా, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ అందుకు సమ్మతించారు. జడ్పీటీసీ సభ్యులు ఆమోదించారు.

కలిసికట్టుగా ఉందాం..: ఎమ్మెల్యే గంగుల
జిల్లాలు విడిపోయినంత మాత్రాన మనం విడిపోలేమనీ, ఎప్పటిలాగానే కలిసి కట్టుగా ఉందామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. చిన్న జిల్లాలు ఏర్పడితే అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందనే అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఈ ఆలోచన చేశారని గుర్తుచేశారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేయాలని ఆయన కోరడంతో జడ్పీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే సుంకె
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. జడ్పీకి నిధులు లేకున్నా మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక నిధులు తెచ్చి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో జడ్పీకి మంచి రోజులు వస్తాయనే నమ్మకం తనకు ఉందన్నారు. తన నియోజకవర్గంలో పీఆర్ రోడ్లు పూర్తిగా అధ్వాన్నంగా మారాయనీ, 10 కోట్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కోరారు.

సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని రెండోసారి అధికారంలోకి తెచ్చేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. వీరి కృషి ఫలితంగానే ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు గౌరవం పెరిగిందని తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులమవుతున్నామని బాధపడొద్దనీ, రాజకీయ నాయకులుగా ప్రజాజీవితంలో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మరో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో విద్యుత్ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని మంత్రి ఎర్రబెల్లికి విజ్ఞప్తి చేశారు. మండలానికి 2 కోట్ల చొప్పున ఉమ్మడి జిల్లాకు కనీసం 100 కోట్లు మంజూరు చేయాలని కోరారు. చొప్పదండి సభ్యుడు ఇప్పనపల్లి సాంబయ్య మాట్లాడుతూ, రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించడంలో శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బోయినపల్లి సభ్యుడు లచ్చిరెడ్డి మాట్లాడుతూ, వేములవాడ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల జోక్యం చేసుకుని వారం పది రోజుల్లో ఈ పనులు ప్రారంభం అవుతాయని వివరించారు. రామడుగు సభ్యురాలు వీర్ల కవిత మాట్లాడుతూ, మిషన్ భగీరథ పనులు ఇంకా పూర్తి కాలేదనీ, పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. మహదేవపూర్ సభ్యుడు రాజిరెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలకు ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించాలనీ, అలా చేస్తే వచ్చే కమీషన్‌తో గ్రామ పంచాయతీలు బలోపేతమయ్యే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేశ్ మాట్లాడుతూ, తన మండలంలోని పీహెచ్‌సీలు ప్రారంభించాలని కోరారు. శంకరపట్నం సభ్యుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ, జీపీలో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి వేతనాలు పెంచాలని మంత్రి ఎర్రబెల్లిని కోరారు. మానకొండూర్ సభ్యుడు ఎడ్ల సుగుణాకర్ మాట్లాడుతూ, ఉపాధి హామీలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో రావాల్సిన ఈఎంబీలను వెంటనే ఇప్పించాలన్నారు.

ముస్తాబాద్ సభ్యుడు శరత్‌కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. మంథని సభ్యురాలు సరోజన మాట్లాడుతూ, ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించలేక పోయామన్నారు. ఎల్లారెడ్డిపేట సభ్యుడు తోట ఆగయ్య మాట్లాడుతూ, ఐదేళ్లలో అనేక సమస్యలు పరిష్కరించుకుని ప్రజల మన్ననలు పొందామన్నారు. బెజ్జంకి జడ్పీటీసీ సభ్యుడు శరత్‌రావు మాట్లాడుతూ, ఐదేళ్లలో అనేక సమస్యలు పరిష్కరించుకున్నామని చెప్పారు. మల్యాల సభ్యురాలు శోభారాణి మాట్లాడుతూ, మిషన్ భగీరథ పనులు తక్షణం పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, కరీంనగర్ ఇన్‌చార్జి కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, జడ్పీ సీఈవో డీ వెంకటమాధవరావు, తదితరులు పాల్గొన్నారు.

165
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles