సర్కారు బడి పిలుస్తోంది..

Wed,June 12, 2019 01:33 AM

-నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
-సకల వసతులతో స్కూళ్లు ముస్తాబు
-ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన
-అందుబాటులో పాఠ్యపుస్తకాలు
-తొలి రోజు నుంచే పంపిణీకి ఏర్పాట్లు
-త్వరలోనే యూనిఫాంలు
-విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ప్రభుత్వోపాధ్యాయులు
-14 నుంచి 19 వరకు బడిబాట వారోత్సవాలు
-గతానికి భిన్నంగా ముందస్తు అడ్మిషన్లు
-పోటాపోటీ నడుమ గురుకులాల్లో ప్రవేశాల భర్తీ
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ ఎడ్యుకేషన్:విశాలమైన భవనాలు.. సువిశాలమైన మైదానాలు.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. అందుబాటులో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు.. ఇంటిని మరిపించే రుచికరమైన భోజనాలు.. ప్రైవేట్‌కు దీటుగా ఫలితాలు.. ఆటపాటల్లోనూ రికార్డులు.. ఇలా సకలవసతులతో బలోపేతమైన సర్కారు బడి పిలుస్తోంది. మంగళవారంతో సెలవులు ముగియగా విద్యార్థులను రారమ్మని ఆహ్వానిస్తోంది. నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలతోపాటే రెసిడెన్షియల్ స్కూళ్లూ తెరుచుకోనుండగా, గతానికి భిన్నంగా ఈ సారి ముందస్తుగా అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది.

ఏప్రిల్ 13తో మొదలైన వేసవి సెలవులు మంగళవారంతో ముగిశాయి. బుధవారం నుంచి అన్ని పాఠశాలలూ తిరిగి తెరుచుకోనున్నాయి. నిన్నటివరకు ఆటాపాటలతో గడిపిన విద్యార్థులంతా నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను ప్రధానోపాధ్యాయులు, ఎస్‌వోలు శుభ్రం చేయించి సిద్ధం చేశారు. పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. త్వరలోనే యూనిఫాంలు అందజేయనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రైవేట్‌కు దీటుగా ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించారు. నాలుగైదేళ్లలో వచ్చిన మార్పులను చూసి తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సారి ప్రధానంగా రెసిడెన్షియల్ స్కూళ్లవైపు బారులు తీరారు.

-సకల వసతులు..
స్వరాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తున్నారు. సర్కారు బళ్లతోపాటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కోట్లాది రూపాయలతో సకలవసతులు కల్పించారు. కేజీ టూ పీజీలో భాగంగా గురుకులాలను ప్రారంభించారు. కొత్త భవనాలను నిర్మించారు. డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేశారు. అధునాతన సాంకేతికతతో హాస్టల్ వసతులు కల్పించారు. ఆటాపాటల కోసం విశాలమైన మైదానాలను సిద్ధంగా ఉంచుతున్నారు. వంట గదులు కట్టించారు. విద్యార్థుల కోసం బెంచీలు, కుర్చీలు ఇలా అవసరమైన ఫర్నిచర్ అందుబాటులోకి తెచ్చారు. మరుగుదొడ్లు, ప్రహరీలు నిర్మించారు.

-పాఠ్యపుస్తకాలు.. యూనిఫాంలు..
విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు యూనిఫాంలు అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి మూడు జతల ఏకరూప దుస్తులతో పాటు ఒక స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తున్నారు. గురుకులాల్లో ప్రతి నెలా (పేస్టు, సబ్బులు మొదలగునవి) వివిధ వస్తువులను కూడా అందిస్తున్నారు. ఇదే సమయంలో యుక్తవయసు ఆడపిల్లలకు హైజెనిక్ హెల్త్ కిట్లు ఇస్తున్నారు. 7వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థినుల వరకు, కేజీబీవీల్లో 6 నుంచి 11వ తరగతి విద్యార్థినులకు, మోడల్ స్కూల్స్‌లో 7 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థినులకు ఉచితంగా కిట్స్ అందిస్తున్నారు.

-పక్కా మెనూతో పౌష్ఠికాహారం
విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా మెనూ ప్రకారం పౌష్ఠికాహారం అందిస్తున్నారు. ప్రతి రోజూ గురుకులాల్లో ఉదయం అల్పాహారం ఇస్తున్నారు. పాలు, బూస్ట్, టిఫిన్ కూడా అందజేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలు, పప్పు, మరో కూరగాయ, గుడ్డు, సాంబార్, చట్నీ, నెయ్యి, పెరుగును విధిగా ఇస్తున్నారు. రాత్రి భోజనంలో కూరగాయలతోపాటు రసం, మజ్జిగ, పండ్లను అందిస్తున్నారు. ప్రతి నెలా రెండో వారంలో చికెన్, ఒకటి, మూడు వారాల్లో మటన్‌పెడుతున్నారు. సర్కారు బళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. వారానికి మూడు రోజులు (సోమ, బుధ, శుక్రవారంలో) కోడిగుడ్లు, ప్రతి శనివారం వెజ్ బిర్యానీ ఇస్తున్నారు.

-పైసా ఖర్చులేకుండా కార్పొరేట్ స్థాయి విద్య
పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి విద్య విద్యను అందిస్తున్నారు. దాంతోపాటే మానవీయ విలువలను నేర్పుతున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. విశాలమైన తరగతి గదులు, మోడ్రన్ లైబ్రరీలు, సైన్స్, మ్యాథ్స్‌లో బోధనను ప్రయోగాల ద్వారా సులువుగా అర్థం చేయిస్తున్నారు. ప్రతి విద్యార్థికీ సైన్స్‌పై ఆసక్తి పెరిగేందుకు ఏటా వైజ్ఞానిక మేళాలను నిర్వహిస్తున్నారు. చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం కల్పిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గురుకులాలల్లో అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి సాయంత్రం 8 గంటల వరకు ప్రత్యేక టైంటేబుల్ రూపొందించారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజన విరామం ఇస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా బోధిస్తున్నారు. ప్రత్యేకంగా వీడియో, ఆడియోల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. కల్చరల్, క్రీడలు, కంప్యూటర్ కోర్సులపై శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ చదువుకునే ప్రతి విద్యార్థికి స్కిల్ డెవలప్‌మెంట్ లోనూ శిక్షణనిస్తున్నారు.

-మెరుగైన ఫలితాలు..
సకల వసతుల నడుమ నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ప్రైవేట్‌కు పోటీ పడుతున్నాయి. ఇటీవల జిల్లాలోని ప్రభుత్వ బడులు, రెసిడెన్షియల్ స్కూళ్లు హవాసాగించాయి. జడ్పీహెచ్‌ఎస్‌లు, మోడల్‌స్కూళ్లు, కస్తూర్బాలు, గురుకులాలు, సాంఘిక సంక్షేమశాఖ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయి.

-విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట..
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఈ నెల 14 నుంచి 19 వరకు బడిబాట వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఇంటింటికీ ప్రచారం చేస్తారు. తమ పాఠశాలలో ఉన్న వసతులు, బోధన, ఫలితాలు, క్రీడల్లో విజయాలు ఇలా అన్నింటినీ వివరించి, పిల్లలను బడికి పంపాలని కోరుతారు.

162
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles