రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలి

Wed,June 12, 2019 01:29 AM

-అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
-ఇన్‌చార్జి కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్
-అధికారులు, రేషన్ డీలర్లతో సమావేశం
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో రేషన్ బియ్యం పంపిణిపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, నాయబ్ తాసిల్దార్లు, రేషన్ డీలర్లు, వీఆర్‌ఏలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాలు, గ్రామాల్లో రేషన్ కార్డుదారులకు ఐరిస్, థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న తర్వాతే బియ్యం తదితర నిత్యావసర సరుకులు ఇవ్వాలని చౌకధరల దుకాణాల డీలర్లను ఆదేశించారు. ఐరిస్, థంబ్ ఇంప్రెషన్ రాని లబ్ధిదారులకు ఒక శాతం మించి సరుకులు పంపిణీ చేయవద్దని ఆదేశించారు. అలాంటివారు ఎక్కువ సంఖ్యలో ఉంటే వారి ఇంటి వద్దకే వెళ్లి నిర్ధారించుకున్నాకే బియ్యం అందజేయాలని సూచించారు. రేషన్ బియ్యం పంపిణిలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్‌కార్డు లబ్ధిదారులను గుర్తించే పనిని ఇప్పటి వరకు వీఆర్‌ఏలు చూసే వారని, ఇకనుంచి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు అప్పగిస్తున్నామని తెలిపారు. కళ్లు, చేతులు పని చేయని రేషన్‌కార్డు లబ్ధిదారుల జాబితాను సంబంధిత మండలాల తాసిల్దార్లకు అందజేయాలని డీలర్లను ఆదేశించారు. రేషన్‌కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం తదితర నిత్యావసర సరుకులను పకడ్బందీగా అందజేయాలని డీలర్లను ఆదేశించారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, నాయబ్ తాసిల్దార్లు నిఘా పటిష్టం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, గంగాధర, మానకొండూర్, గన్నేరువరం, శంకరపట్నం మండలాల నాయబ్ తాసిల్దార్లు, రేషన్ డీలర్లు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles